నిర్మల్/ఆదిలాబాద్, వెలుగు: బీజేపీ కేవలం ఓట్ల కోసమే శ్రీరాముడి జపం చేస్తోందని, రాముడి పేరు వాడుకునే హక్కు ఆ పార్టీకి లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా మహేశ్‌గౌడ్ మాట్లాడుతూ శ్రీరాముడి పేరు చెప్పుకొని బీజేపీ రాజకీయాలు చేయడం సరికాదన్నారు. పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని ఆరోపించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేస్తూ దేశాన్ని అంబానీ, ఆదానీలకు అప్పగిస్తోందని అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేవలం మూడు రోజుల్లోనే రాష్ట్రానికి రూ.5.78 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారని పేర్కొన్నారు.
బీజేపీని గెలిపించినందుకు ప్రజల్లో పశ్చాత్తాపం..
బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలను గెలిపించినందుకు ప్రజలు పశ్చాత్తాప పడుతున్నారని మహేశ్‌గౌడ్ అన్నారు. ఆదిలాబాద్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాల్లో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, డీసీసీ అధ్యక్షులు వెడ్మ బొజ్జు, నరేశ్ జాదవ్, మాజీ ఎంపీ సోయం బాపురావు, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష తదితరులు పాల్గొన్నారు.
