- వంద రోజులని చెప్పి.. వెయ్యి రోజులైనా అమలు చేయలేదు: రాంచందర్ రావు
- కేవలం ఓట్ల కోసమే హామీలు ఇచ్చిన్రు
- కాంగ్రెస్ పాలన భస్మాసుర హస్తమని విమర్శ
హైదరాబాద్, వెలుగు: 23 నెలల కాంగ్రెస్ పాలనంతా వైఫల్యాలు, మోసాలతో కూడుకున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు ఒక భస్మాసుర హస్తంగా మారిందని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని కాంగ్రెస్ నేతలు ప్రజల దగ్గరికి వెళ్తున్నారని ప్రశ్నించారు. శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో కాంగ్రెస్ పాలనపై రాంచందర్ రావు చార్జ్‌షీట్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్ మేనిఫెస్టోలో 420 హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ప్రకటించారు. కానీ అధికారంలోకి వచ్చి దాదాపు వెయ్యి రోజులైనా ఒక్క హామీ అమలు చేయలేదు. ఈ చార్జ్‌షీట్ ద్వారా సర్కార్ వైఫల్యాలను ప్రజల ముందు పెడుతున్నాం” అని పేర్కొన్నారు.
‘‘ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలు రాక పేదలకు వైద్యం అందడం లేదు. రుణమాఫీ కాక రైతులు గోస పడుతున్నారు. చివరకు ప్రజలే ప్రభుత్వాన్ని మాఫీ చేసే పరిస్థితిని తీసుకొచ్చారు. విద్యార్థినులకు ఉచితంగా స్కూటీలు ఇస్తామని చెప్పి, కనీసం సైకిల్ కూడా ఇవ్వలేదు” అని మండిపడ్డారు. ఓట్ల కోసమే కాంగ్రెస్ హామీలు ఇచ్చిందని, బీసీ రిజర్వేషన్లు కూడా అందులో భాగమేనని అన్నారు.
సీఎం వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం..
జవాన్ల త్యాగాలు, జాతీయ భద్రత వంటి అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని రాంచందర్ రావు చెప్పారు. సీఎం చేసిన వ్యాఖ్యలు ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని అన్నారు. ‘‘తెలంగాణ ప్రజల మనోభావాలను, దేశ గౌరవాన్ని దెబ్బతీసేలా సీఎం వ్యాఖ్యలు ఉన్నాయి. పహల్గాం ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అమరులను అవమానపరిచేలా ముఖ్యమంత్రి మాట్లాడారు. దేశ భద్రత, సైనికుల త్యాగాలు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే అంశాలు కాదు. కాంగ్రెస్ నేతలు వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలి” అని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్‌కు ఓట్లడిగే హక్కు లేదు: ఏలేటి
ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్‌కు జూబ్లీహిల్స్‌లో ఓట్లు అడిగే హక్కు లేదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఇచ్చిన హామీలను అమలు చేసి ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు.
జూబ్లీహిల్స్‌లో గుడి భూములను గుంజుకొని కబరస్తాన్‌కు ధారాదత్తం చేస్తున్నారని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. సర్కార్ భూములను మత సంస్థలకు అప్పగించడం మానుకోవాలన్నారు. కేసీఆర్ అవినీతికి పాల్పడిన లక్ష కోట్లు కక్కిస్తామన్నారని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, ఆ హామీ ఏమైందని ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు. ఇప్పటి వరకూ కేసీఆర్ కుటుంబం నుంచి ఎంత కక్కించారో వైట్‌పేపర్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్, బీజేపీ నేతలు గౌతమ్ రావు, ప్రకాశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
