హైదరాబాద్, వెలుగు: కేంద్రం లాక్ డౌన్ ను బ్రేక్ చేసిందంటూ జరుగుతున్న ప్రచారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. ఇలా అసత్యాలను ప్రచారం చేయడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ అండదండలతో నడిచే కొన్ని సంస్థలు ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తుంటే.. ప్రజలు ఇదే నిజమని నమ్మి రేపు నిజంగా లాక్ డౌన్ ను బ్రేక్ చేసి రోడ్లపైకి వచ్చే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని సీఎం కేసీఆర్ను ప్రశ్నించారు. తప్పుడు ప్రచారం చేసిన సంబంధిత యాజమాన్యం వెంటనే కేంద్ర ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలని గురువారం ఆయన ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఆ యాజమాన్యంపై కేంద్ర సమాచార మంత్రిత్వశాఖకు, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
విషం కక్కితే ఊరుకోం
టీఆర్ఎస్ ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలను అతిక్రమించి తప్పిదాలు చేసినప్పటికీ ఇలాంటి టైంలో రాజకీయాలు తగవని ఓపికతో సలహాలు, సూచనలకే పరిమితమయ్యామని బండి సంజయ్ పేర్కొన్నారు. ‘మేం టీఆర్ఎస్ మాదిరి రాజకీయాలు చేయాలనుకుంటే కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను, నిర్లక్ష్యాన్ని ఎప్పటికప్పుడు ఎండగట్టేవాళ్లం. కానీ ఇది తప్పులు ఎత్తి చూపే సమయం కాదు. రాజకీయ విమర్శలకు కరోనాను వేదికగా చేసుకోవద్దు. అందుకే మౌనంగా ఉన్నం. నైతిక విలువలను కాపాడాల్సిన వారు, సంస్థలు ఈ టైంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి’ అని హితవుపలికారు. కేంద్రంపై విషం కక్కుతూ, రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. రాష్ట్రంలో డాక్టర్లకు, నర్సులకు పీపీఈ కిట్స్ లేవని చెప్పిన వారిపై కేసులు పెడుతామని బెదిరించిన సీఎం కేసీఆర్ కు ఇప్పుడు రాష్ట్రంలో కొన్ని సంస్థలు చేస్తున్న తప్పుడు ప్రచారం కనిపించడం లేదా..? అని ప్రశ్నించారు.
పేదల కష్టాలు పట్టవా?
బీజేపీ కార్యకర్తలు తమకు తిండికి లేకున్నా వలస కూలీలు, కార్మికులు, నిరుపేదలు పస్తులుండకూడదనే ఉద్దేశంతో ముందుకు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా నిత్యావసర వస్తువులు, అన్నదానాలు చేస్తున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఎక్కడున్నారని, వాళ్లకు పేదల కష్టాలు పట్టవా? అని ఆయన నిలదీశారు. రాష్ట్రంలో పీపీఈ కిట్స్ ఇప్పటివరకు అందుబాటులో లేవనే విషయాన్ని సీఎం కేసీఆర్ తెలుసుకోవాలని సూచించారు. డాక్టర్లకు, నర్సులకు సరిపోయే కిట్స్ తెప్పించాలనే సోయి సీఎంకు లేదా అని మండిపడ్డారు.
ప్రజలే బుద్ధి చెప్తరు
ప్రధాని మోడీ సీఎంల వీడియో కాన్ఫరెన్స్ పెట్టి సలహాలు సూచనలు తీసుకుంటే.. మిగతా సీఎంలకు ఏమీ తెలియదంటూ తానే అన్నీ మోడీకి చెప్పినట్లు సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో బాకా కొట్టుకున్నారని బండి సంజయ్ ధ్వజమెత్తారు. ప్రధానితో మాట్లాడిన రెండు నిమిషాల విషయాన్ని ప్రగతి భవన్లో ప్రెస్ మీట్ పెట్టి గంటన్నర ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రికే దక్కుతుందని ఆయన ఎద్దేవా చేశారు. తామిప్పటి వరకు సహనంతో సమాజ శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం తప్పులు చేసినా, ఏమీ అనకుండా సహకరిస్తూ వచ్చామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ కరోనా కట్టడికి మిగతా రాజకీయ పార్టీలను ఒక్కసారి కూడా సంప్రదించలేదని, కనీసం అఖిలపక్ష సమావేశం కూడా ఏర్పాటు చేయలేదని ఆయన మండిపడ్డారు. సీఎం కేసీఆర్, ఆయన మంత్రి వర్గం చేస్తున్న తప్పిదాలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెప్తారని హెచ్చరించారు
