దేశ ప్రజలకు కాంగ్రెస్ తీరని ద్రోహం చేసింది

దేశ ప్రజలకు కాంగ్రెస్ తీరని ద్రోహం చేసింది

సోనియాపై జేపీ నడ్డా పదునైన విమర్శలు
న్యూఢిల్లీ: బీజేపీ చీఫ్ జేపీ నడ్డా మరోసారి కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా సోనియా గాంధీని టార్గెట్‌గా చేసుకొని ఆయన పదునైన విరమ్శలు చేశారు. ‘ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోవడానికే ప్రధాన మంత్రి నేషనల్ రిలీఫ్​ ఫండ్‌ (పీఎంఎన్‌ఆర్‌‌ఎఫ్) ఉంది. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌ (ఆర్‌‌జీఎఫ్​)కు ఈ ఫండ్‌ నుంచి విరాళం వెళ్లేది. పీఎంఎన్‌ఆర్‌‌ఎఫ్‌ బోర్డులో ఎవరున్నారు? ఆర్‌‌జీఎఫ్​కు ఎవరు అధ్యక్షతన వహించారు? వీటికి సమాధానం.. సోనియా గాంధీ. ఇది పూర్తిగా ఖండించదగినది. విలువలు, ప్రక్రియలను పూర్తిగా విస్మరించారు. పారదర్శకత గురించి అస్సలు బాధపడలేదు’ అని నడ్డా ట్వీట్ చేశారు.

రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కు 2005 నుంచి 2008 వరకు విరాళాలు ఇచ్చిన వారి వివరాలను ఆ ట్వీట్స్‌కు నడ్డా జత చేశారు. ‘ఇండియా ప్రజలు తోటి పౌరులకు సాయం చేయాలనే ఉద్దేశంతో తమ కష్టార్జితంతో సంపాదించిన డబ్బులను పీఎంఎన్‌ఆర్ఎఫ్‌కు డొనేట్ చేశారు. ఈ ప్రజా ధనాన్ని తమ కుటుంబం నడిపించే ఫౌండేషన్‌కు బదిలీ చేయడం పెద్ద మోసమే కాదు, దేశ ప్రజలకు చేసిన అతి పెద్ద ద్రోహం కూడా. సంపాదన పై ఒక ఫ్యామిలీకి ఉన్న మోహం.. మొత్తం దేశానికే సమస్యలు తెచ్చిపెట్టింది. వారు తమ శక్తిని నిర్మాణాత్మక ఎజెండా కోసమే వినియోగించారు. స్వయం లాభాల కోసం దోపిడీకి పాల్పడినందుకు కాంగ్రెస్ రాజ వంశం క్షమాపణ చెప్పాల్సిందే’ అని నడ్డా మండిపడ్డారు.