- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు
- అంబేద్కర్‌ను అడుగడుగునా అవమానించారు
- కాంగ్రెస్ మోసాలకు విద్యార్థులు బలికావొద్దు
- ఈశ్వర్ చారి కుటుంబానికి అండగా ఉంటామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాజ్యాంగం గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉందని, ఆనాడు రాజ్యాంగాన్ని మంటగలిపి ఎమర్జెన్సీ తెచ్చి జనం హక్కులను కాలరాసింది హస్తం పార్టీనేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు ఆరోపించారు. దేశాన్ని 60 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ అంబేద్కర్ ను అడుగడుగునా అవమానిస్తే.. ప్రధాని మోదీ మాత్రం ‘పంచతీర్థాల’తో ఆ మహనీయుడిని గౌరవిస్తున్నారని గుర్తు చేశారు.
శనివారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి రామచందర్ రావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామచందర్ రావు మాట్లాడుతూ.. "అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ ఇష్టారాజ్యంగా మార్చే ప్రయత్నం చేసింది. ఎమర్జెన్సీ టైమ్‌లో మౌలిక హక్కులను తొక్కిపారేసిన చరిత్ర వాళ్లది.
ఇయ్యాల రాజ్యాంగం గురించి వాళ్లు నీతులు చెప్తుంటే అసహ్యం వేస్తోంది" అని మండిపడ్డారు. నెహ్రూ, ఇందిరా గాంధీకి బతికుండగానే భారతరత్న ఇచ్చుకున్న కాంగ్రెస్.. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు మాత్రం ఆ అవార్డు ఎందుకు ఇయ్యలేదని ప్రశ్నించారు. 1990లో బీజేపీ మద్దతు వల్లే బాబాసాహెబ్ కు భారతరత్న దక్కిందని గుర్తు చేశారు. లండన్ లో అంబేద్కర్ చదువుకున్న ఇంటిని లైబ్రరీగా మార్చినా, ముంబై, నాగపూర్ లో స్మారకాలు కట్టినా.. అది మోదీ ఘనతేనన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ బీసీలను మోసం చేస్తున్నదని రామచందర్ రావు ఆరోపించారు. కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి ఇప్పుడు చేతులెత్తేయడంతో బీసీ బిడ్డలు ఆందోళనలో ఉన్నారని అన్నారు. బీసీ విద్యార్థి ఈశ్వర్ చారి ఆత్మహత్య చేసుకోవడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. యువత ప్రాణాలు తీసుకోవద్దని, బతికుండి ఈ దుర్మార్గపు ప్రభుత్వంపై కొట్లాడాలని పిలుపునిచ్చారు.
చనిపోయిన విద్యార్థి కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. దళిత, బలహీన వర్గాల కోసం చిత్తశుద్ధితో పనిచేసేది ఒక్క బీజేపీనే అని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ నేతలు చంద్రశేఖర్ తివారీ, గౌతం రావు, వేముల అశోక్, క్రాంతి కిరణ్, చింతా సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మాజీ గవర్నర్ దత్తాత్రేయతో కలిసి బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు పూలమాల వేసి నివాళులర్పించారు.
