
- బీజేపీ కార్యకర్తలకు పార్టీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు పిలుపు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో వరద సహాయక చర్యల్లో పార్టీ క్యాడర్ పాల్గొనాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు పిలుపునిచ్చారు. బూత్‌ల వారిగా సహాయ కార్యక్రమాలు చేపట్టి, ప్రభుత్వ యంత్రాంగానికి సహకారం అందించాలని సూచించారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలకు ఆహారం, తాగునీరు, రవాణా సౌకర్యాలను కల్పించాలని ఆదేశించారు. గురువారం బీజేపీ క్యాడర్‌తో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
బీజేవైంఏ క్యాడర్, కార్పొరేటర్లు వెంటనే సహాయక చర్యల్లో పాల్గొనాలని సూచించారు. వరద ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించే ప్రక్రియలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు పార్టీ శ్రేణులు సహకరించాలని కోరారు. మరోవైపు, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, జేడీ నడ్డాతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు.రాష్ట్రంలో వరద పరిస్థితులపై కేంద్రం నిరంతరం పర్యవేక్షిస్తోందని, అవసరమైన అన్ని సహాయ, సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు.
అవసరమైతే కేంద్రం నుంచి అదనపు సిబ్బంది, సామగ్రిని పంపించేందుకు వారు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు హెలికాప్టర్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించాలని విజ్ఞప్తి చేయగా, కేంద్రం సానుకూలంగా స్పందించి ప్రత్యేక హెలికాప్టర్లను పంపిందని ఆయన తెలిపారు.