రజనీకి బీజేపీ కౌంటర్: మేం ఎప్పుడూ అలా చెప్పలేదు

రజనీకి బీజేపీ కౌంటర్: మేం ఎప్పుడూ అలా చెప్పలేదు

తాను బీజేపీ ట్రాప్‌లో పడనంటూ సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ వెంటనే స్పందించింది. రజనీకాంత్ తమ పార్టీలో చేరుతున్నట్లు తామెప్పుడూ చెప్పలేదని స్పష్టం చేసింది. ఆ రకమైన ప్రచారం కూడా తాము కోరుకోలేదని తెలిపింది.

‘బీజేపీ కాషాయ రంగు పులిమే ప్రయత్నం చేస్తోంది. ఇటీవలే తిరువళ్లువర్‌కు ఆ రంగు వేశారు. ఇప్పుడు నన్ను కూడా ఆ ట్రాప్‌లోకి లాగాలని చూస్తున్నారు. అది జరగదు’ అంటూ రజనీకాంత్ కామెంట్ చేశారు.

రజనీ వ్యాఖ్యలతో బీజేపీ అప్రమత్తమైంది. రజనీకాంత్ బీజేపీలో చేరారని కానీ, జాయిన్ అవబోతున్నారని కానీ ఎప్పుడూ చెప్పలేదని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు చెప్పారు. ఈ రకమైన గాలి ప్రచారాలు బీజేపీకి ఇష్టం ఉండదని స్పష్టం చేశారాయన. తమ పార్టీ తమిళనాడులో జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికలపై ఫోకస్ పెట్టి పని చేస్తోందని చెప్పారు.