మతపరమైన రిజర్వేషన్లు ఒప్పుకోం : బీజేపీ స్టేట్చీఫ్ రాంచందర్‌‌రావు

మతపరమైన రిజర్వేషన్లు ఒప్పుకోం : బీజేపీ స్టేట్చీఫ్ రాంచందర్‌‌రావు
  • 42 శాతం రిజర్వేషన్లు పూర్తిగా బీసీలకే ఇయ్యాలే : బీజేపీ స్టేట్​చీఫ్ రాంచందర్‌‌రావు

పెద్దపల్లి, వెలుగు : మతపరమైన రిజర్వేషన్లను బీజేపీ ఒప్పుకోదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌‌రావు చెప్పారు. 42 శాతం రిజర్వేషన్లను పూర్తిగా బీసీలకే ఇయ్యాలని, ఒక్క శాతం కూడా ఇతరులకు ఇచ్చినా అంగీకరించబోమన్నారు. కాళేశ్వరంపై అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాతే తాము స్పందిస్తామని, కాళేశ్వరం విచారణను సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌‌ చేశారు. పెద్దపల్లిలో  మంగళవారం జరిగిన  కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాష్ట్రంలో ఆఫీసర్ల నిఘా లేకపోవడంతో యూరియా బ్లాక్‌‌ మార్కెట్‌‌కు తరలిపోతుందని ఆరోపించారు. బీసీలను మరోసారి మోసం చేసేందుకే కాంగ్రెస్​నాయకులు ఢిల్లీ వెళ్లారని విమర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు మల్క కొమురయ్య, అంజిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డి, నాయకులు దుగ్యాల ప్రదీప్‌‌రావు, గుజ్జుల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు రాంచందర్‌‌రావుక గజమాల వేయడానికి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌‌రావు వర్గాల నేతలు పోటీ పడ్డారు. దీంతో  రెండు వర్గాల మధ్య ఘర్షణ జరుగగా,, ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు.

కేంద్రం రైతుల పక్షపాతి

మంచిర్యాల/లక్సెట్టిపేట/ కోల్‌బెల్ట్‌, వెలుగు : కేంద్ర ప్రభుత్వం రైతుల పక్షపాతి, అన్నదాతల సంక్షేమానికి కట్టుబడి ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌‌.రాంచందర్‌‌రావు చెప్పారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలోని ఎస్‌‌పీఆర్‌‌ గార్డెన్స్‌‌లో మంగళవారం నిర్వహించిన రైతు సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి సంవత్సరం మద్దతు ధరలు పెంచుతోందన్నారు. కిసాన్‌‌ సమ్మాన్‌‌ నిధి కింద రూ.6 వేల కోట్లను రైతుల ఖాతాల్లో డిపాజిట్‌‌ చేస్తోందని చెప్పారు. 

కేంద్రం యూరియా ఇవ్వకపోవడం వల్లే రాష్ట్రంలో కొరత ఏర్పడిందంటూ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. అనంతరం మంచిర్యాలలోని పార్టీ ఆఫీస్‌‌లో కార్యకర్తలతో, బార్‌‌ అసోసియేషన్‌‌లో అడ్వకేట్లతో సమావేశం అయ్యారు. ఎమ్మెల్సీలు మల్క కొమురయ్య, చిన్నమైల్‌‌ అంజిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌‌గౌడ్‌‌, మాజీ అధ్యక్షుడు రఘునాథ్‌‌రావు, మాజీ ఎంపీ బోర్లకుంట వెంకటేశ్​నేత, నాయకులు గోమాసె శ్రీనివాస్ పాల్గొన్నారు. అనంతరం మందమర్రి పట్టణంలో నిర్వహించిన మీటింగ్‌కు హాజరయ్యారు.