నవంబర్ 2న బీజేపీ ఫైనల్ లిస్ట్!

నవంబర్ 2న బీజేపీ ఫైనల్ లిస్ట్!
  • ఇయ్యాల బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు మీటింగ్
  • జనసేనకు 8 నుంచి 10 స్థానాలు!

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ దగ్గర పడడంతో అభ్యర్థుల ఎంపికపై బీజేపీ స్పీడ్ పెంచింది. ఇప్పటి వరకు రెండు విడతల్లో 53 మందిని ప్రకటించిన పార్టీ మిగిలిన స్థానాలకు గురువారం ఒకే సారి ఫైనల్ లిస్ట్ విడుదల చేయాలని డిసైడ్ అయింది. అలాగే జనసేనతో పొత్తు, వారికి కేటాయించే సీట్లపై నిర్ణయం తీసుకోనుంది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర కోర్ కమిటీ నేతలు మంగళవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్ చార్జ్ ప్రకాశ్ జవదేకర్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో బీజేపీ తరుణ్ చుగ్, పార్టీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి, కె.లక్ష్మణ్, డీకే అరుణ, ఈటల రాజేందర్, సునీల్ బన్సల్ పాల్గొన్నారు. జిల్లాల వారీగా అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. గెలుపు అవకాశాలు, ప్రజల్లో గుర్తింపు, పార్టీ సర్వేల్లో ముందు వరుసలో ఉన్న వారి పేర్లతో లిస్ట్ రూపొందించారు. ఈ జాబితాపై మరోసారి బుధవారం భేటీ కావాలని నిర్ణయించినట్లు తెలిసింది. తర్వాత ఫైనల్ లిస్ట్ ను పార్టీ చీఫ్ నడ్డాకు సమర్పించనున్నారు. ఈ లిస్ట్​పై సాయంత్రం ఆరు గంటలకు పార్టీ హెడ్ ఆఫీసులో జరగనున్న పార్టీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్ లో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.

నడ్డాతో కిషన్ రెడ్డి భేటీ

అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక, జనసేన పొత్తు అంశాలపై నడ్డాతో కిషన్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. ‘మేరీ మాటీ, మేరా దేశ్’ ప్రొగ్రాం ముగిసిన అనంతరం కిషన్ రెడ్డి నేరుగా నడ్డా నివాసానికి చేరుకున్నారు. అభ్యర్థుల ఎంపిక, జనసేనతో పొత్తుపై కొద్దిసేపు నడ్డాతో చర్చలు జరిపారు. జనసేనకు 8 నుంచి 10 సీట్లు ఇవ్వాలని ఈ సందర్భంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.