
దూకుడు పెంచిన బీజేపీ
తెలంగాణలో కాంగ్రెస్ను, ఏపీలో టీడీపీని రీప్లేస్చేయడంపై నజర్
హైదరాబాద్, వెలుగు: భవిష్యత్తులో తెలంగాణ, ఏపీల్లో పాగా వేయాలని భావిస్తున్న బీజేపీ.. ఆ దిశగా వేగం పెంచింది. ఇతర పార్టీల నుంచి నేతలు, కేడర్‌ను ఆకర్షించి.. బీజేపీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇందుకోసం ఇద్దరు జాతీయ స్థాయి నేతలు రంగంలోకి దిగి, చర్చలు మొదలుపెట్టారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో భేటీ ఓ కొలిక్కి వచ్చిందని, మరికొందరితో సంప్రదింపులు జరుగుతున్నాయని సమాచారం. ఇక ఇప్పటికే దాదాపు కనుమరుగైన తెలంగాణ టీడీపీలో మిగిలిన సీనియర్లను చేర్చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఎల్.రమణ, రావుల తదితర నేతలతో చర్చలు మొదలుపెట్టింది.
నేతల వెంట కేడర్ కూడా వస్తుందని, దీనివల్ల క్షేత్రస్థాయిలో బీజేపీ బలపడుతుందని ఆ పార్టీ పెద్దలు అభిప్రాయపడుతున్నారు. అన్ని పార్టీల నేతలనూ పిలిపించుకుని మాట్లాడుతున్నారు. భవిష్యత్తులో బీజేపీయే టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని చెబుతున్నారు. అటు ఏపీ అయితే బీజేపీ మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. ప్రతిపక్షంగా ఉన్న టీడీపీని ఖాళీ చేసి, తామే ప్రతిపక్షంగా నిలిచేందుకు ప్రయత్నాలు వేగిరం చేసింది. ఇప్పటికే నలుగురు ఎంపీలను చేర్చుకుని షాకిచ్చింది. మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేలనూ లాగేసి, అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా పొందాలని యోచిస్తోంది. మొత్తంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్లేస్‌ను, ఏపీలో టీడీపీ ప్లేస్‌ను రీప్లేస్ చేయాలని బీజేపీ భావిస్తోంది.
అన్ని వర్గాల వారిని..
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడటం చూసిన బీజేపీ ముందుగా ఆ పార్టీ నేతలపై ఎక్కువ ఫోకస్ చేసింది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో సాగించిన సంప్రదింపులు దాదాపుగా కొలిక్కి వచ్చాయని సమాచారం. ఆయన మాటలను బట్టి చూస్తే నేడో రేపో బీజేపీలో చేరిపోవడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు. ఇక ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డిలను కూడా బీజేపీ సంప్రదించినా
వారు తిరస్కరించినట్టు సమాచారం. మరో మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్యేని పార్టీలోకి రప్పించేందుకు ఓ కాంగ్రెస్ నేత ద్వారా రాయబారం నడిపినా సఫలం కాలేదని తెలుస్తోంది. అయితే బీజేపీ తొలి దశలో కేవలం ఒకే కులానికే (రెడ్లు) చెందిన వారితో సంప్రదింపులు జరిపింది. అప్పుడు పాలమూరుకు చెందిన జితేందర్‌రెడ్డి, డీకే అరుణలాంటి రెడ్డి నేతలు చేరారు. ఎన్నికల తర్వాతా ఆ కులం నేతలతోనే టచ్‌లో ఉండటంతో పార్టీకి ఆ కులం ముద్ర పడుతుందన్న అభిప్రాయం నెలకొంది. ఇది పార్టీ విస్తరణకు ఆటంకం కలిగిస్తుందన్న ఆలోచనతో బీజేపీ అలర్టయింది. అన్ని వర్గాలకు చెందిన నేతలతో సంప్రదింపులు మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఓ ప్రముఖ బీసీ నేతతో మాట్లాడుతున్నట్టు సమాచారం.
కాంగ్రెస్ ప్లేస్‌పై కన్ను
తెలంగాణలో కాంగ్రెస్ స్థానాన్ని, ఏపీలో టీడీపీ స్థానాన్ని రీప్లేస్ చేసి.. రెండు రాష్ట్రాల్లో ప్రధాన ప్రతిపక్షంగా మారాలని బీజేపీ స్కెచ్ వేసింది. బీజేపీ జాతీయ నేతలు రాం మాధవ్, మురళీధర్ రావుల ఆధ్వర్యంలో ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. బీజేపీ నేత మురళీధర్‌రావు ఇటీవల ఒక ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. ‘రెండేళ్లలో బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ప్రతిపక్షంగా మారుతుంది. అన్ని పార్టీల నేతలు మాతో టచ్‌లో ఉన్నారు.’అని ప్రకటించారు కూడా. కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు, వరుసగా ఎలక్షన్లలో దెబ్బతినడంతో ఆ పార్టీ నేతలను ఆకర్షించడంపై బీజేపీ దృష్టి పెట్టింది. అధికార టీఆర్‌ఎస్ ఇప్పటికే ఓవర్ లోడ్ కావడంతో కాంగ్రెస్ నేతలు బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నారు కూడా. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీయే ఎదుగుతుందని వారు నమ్ముతున్నారు. మరోవైపు ఇప్పటికే దాదాపు కనుమరుగైన తెలంగాణ టీడీపీలో మిగిలిన సీనియర్లను చేర్చుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలో టీటీడీపీ చీఫ్ ఎల్.రమణ, సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డిలను సంప్రదించినట్టు తెలిసింది. సీనియర్లు పెద్దిరెడ్డి, చాడ సురేష్ రెడ్డి ఇప్పటికే రాంమాధవ్‌తో భేటీ అయి.. బీజేపీలో చేరేందుకు రెడీగా ఉన్నామని చెప్పినట్టు సమాచారం.
ఏపీలో ఫుల్ స్పీడ్..
బీజేపీ ఏపీలో మాత్రం ఫుల్ స్పీడ్ తో దూసుకెళుతోంది. ఇప్పటికే నలుగురు ఎంపీలను చేర్చుకుని.. టీడీపీ రాజ్యసభాపక్షాన్ని విలీనం చేసుకుంది. అదే దిశలో లోక్‌సభ సభ్యులు, ఎమ్మెల్యేలపైనా ఫోకస్ పెట్టింది. ఏపీ టీడీపీలో ఉన్న 23 మంది ఎమ్మెల్యేల్లో రెండొంతుల మంది తమతో టచ్‌లో ఉన్నారని ఏపీ బీజేపీ చీఫ్ విష్ణుకుమార్‌రాజు రెండు రోజుల మీడియాతో వ్యాఖ్యానించడం గమనార్హం. ఇప్పటికిప్పుడు జంప్ చేసేందుకు ఎనిమిది మంది సిద్ధంగా ఉన్నట్టు వారి పేర్లతో సహా ప్రచారం జరుగుతోంది. ఫిరాయింపుదారుల పట్ల కఠినంగా ఉంటామని ఏపీ సీఎం జగన్ ప్రకటించడంతో.. మరికొందరు ఎమ్మెల్యేల కోసం బీజేపీ ఎదురుచూస్తున్నట్టు తెలిసింది. మూడింట రెండొంతుల మంది టీడీపీ ఎమ్మెల్యేలు వచ్చి చేరితే.. ఫిరాయింపుల వేటు తప్పించుకోవచ్చని ఎమ్మెల్యేలు భావిస్తున్నట్టు సమాచారం. ఇక ఎమ్మెల్యేలతోపాటు కొందరు కీలక నేతలపైనా బీజేపీ నజర్ పెట్టింది. ఈ క్రమంలోనే ఇటీవల కాకినాడలో కాపు నేతలు సమావేశమై.. టీడీపీలో భవిష్యత్తు లేదని, ఆ పార్టీలో ఇంకా కొనసాగడంలో అర్థం లేదని నిర్ణయించుకున్నట్టు తెలిసింది.
కాపు నేతల్లో మెజారిటీ వర్గం చంద్రబాబు తనయుడు లోకేశ్‌పై ఆగ్రహంతో, అపనమ్మకంతో ఉన్నారని సమాచారం. లోకేశ్ ఎప్పుడూ కమ్మ కులానికే ప్రాధాన్యత ఇచ్చారని, కీలక పదవులు ఆ వర్గానికే ఇచ్చుకున్నారని కాపులు కోపంగా ఉన్నారు. భవిష్యత్తులో లోకేశ్ టీడీపీ పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని, ఆయనకు పార్టీని నడిపే సమర్థత లేదని అభిప్రాయపడుతున్నారు. మళ్లీ ఎన్నికల నాటికి చంద్రబాబుకు వయసు మీదపడుతుందని, అందువల్ల భవిష్యత్తు బాగుండాలంటే.. బీజేపీ వైపు వెళ్లడమే మేలని భావిస్తున్నట్టు సమాచారం. మొత్తంగా పరిస్థితులు కూడా బీజేపీ వ్యూహానికి కలిసి వస్తున్నాయి.