ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలపై బీజేపీ ఫోకస్

ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలపై బీజేపీ ఫోకస్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. తెలంగాణలోని మొత్తం 19 ఎస్సీ నియోజకవర్గాలు, 12 ఎస్టీ నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించడమే లక్ష్యంగా పని చేయాలని రాష్ట్ర పార్టీని జాతీయ నాయకత్వం ఆదేశించింది. ఈ నెల 9న హైదరాబాద్‌‌‌‌లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల పార్టీ అధ్యక్షుల సమావేశంలో పార్టీ చీఫ్ జేపీ నడ్డా, పార్టీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ఈ అంశంపై పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. దీంతో రాష్ట్ర నేతలు ఇప్పుడు రిజర్వ్‌‌ నియోజకవర్గాలపై దృష్టి పెట్టారు. 

కర్నాటకలో బీజేపీ ఓటమికి రిజర్వ్‌‌డ్‌‌ నియోజకవర్గాల్లో అనుకున్న విధంగా సీట్లు గెలవకపోవడమే ప్రధాన కారణమని గుర్తించిన జాతీయ నాయకత్వం ఈ విషయంలో తెలంగాణ నేతలను అప్రమత్తం చేసింది. రాష్ట్రంలోని మొత్తం 31 రిజర్వుడు నియోజకవర్గాల్లో మెజార్టీ సీట్లను బీజేపీ గెలుచుకునేలా ఆయా స్థానాల్లో పార్టీ బలోపేతం కోసం ఇప్పటికే ప్రత్యేక కమిటీలను నియమించింది. త్వరలో దళిత, గిరిజన వాడల్లో పార్టీ కార్యక్రమాలను నిర్వహించాలని, ఇంటింటికి వెళ్లి మోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించాలని ఆదేశించింది. 

అలాగే, అక్కడే భోజనంతో పాటు బస కూడా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ పెద్దపెద్ద హోర్డింగ్‌‌లు పెట్టేందుకు కూడా రాష్ట్ర బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.