తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫోకస్

 తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫోకస్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరో ఎనిమిది నెలల్లో ఎన్నికలు రానుండడంతో తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. అసెంబ్లీ సీట్ల వారీగా పార్టీ పరిస్థితిపై ఆరా తీస్తుంది. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. ఎదుర్కోవాలన్న ధీమాతో ఉన్న హైకమాండ్.. ఆ దిశగా పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని పరుగులు పెట్టిస్తున్నది. రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే బీజేపీ కనీసం 60  సీట్లు సాధించాలి. నియోజకవర్గాల వారీగా పార్టీ బలాబాలాలను లెక్కతీస్తున్నది.

ఆయా వివరాల కోసం రాష్ట్ర నేతలను హైకమాండ్ అలెర్ట్ చేస్తుంది. ఇందులో భాగంగానే పార్టీ బలంగా ఉండి గెలుపు ఖాయమనే ధీమా ఉన్న నియోజకవర్గాలను ఏ గ్రేడ్ గా, కొద్దిగా కష్టపడితే గెలుస్తామనే ఆశ ఉన్న నియోజకవర్గాలను బీ గ్రేడ్ గా, బాగా దృష్టి పెడితే గెలిచేందుకు కొంత వరకు చాన్స్ ఉంటుందనే పరిస్థితి కనిపించే నియోజకవర్గాలను సీ గ్రేడ్​గా, పార్టీ చాలా వీక్ గా ఉంది, ఈ సారికి ఇక్కడ గెలుపుపై ఆశలు వదులుకోవాల్సిందే.. అనే పరిస్థితి ఉన్న నియోజకవర్గాలను డీ గ్రేడ్ గా విభజించి ఒక రిపోర్ట్ తయారు చేయాలని హైకమాండ్ రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని ఆదేశించినట్లు తెలిసింది. దీని ఆధారంగా ఏయే నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంపై ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలనే దానిపై ఢిల్లీ పెద్దలు.. రాష్ట్ర నేతలకు దిశా నిర్దేశం చేయనున్నట్లు సమాచారం.