మంచిర్యాలలో వీధి కుక్కల స్వైరవిహారం..రెండేళ్ల చిన్నారిపై దాడి.. తలకు తీవ్ర గాయాలు

మంచిర్యాలలో వీధి కుక్కల స్వైరవిహారం..రెండేళ్ల చిన్నారిపై దాడి.. తలకు తీవ్ర గాయాలు

మంచిర్యాల జిల్లా కేంద్రంలో వీధి కుక్కలు మరోసారి రెచ్చిపోయాయి. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 4వ డివిజన్, లక్ష్మీనగర్ కాలనీలో శుక్రవారం గుంపుగా వచ్చిన కుక్కలు ఒక చిన్నారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి.

శుక్రవారం (మార్చి20) మంచిర్యాల పట్టణంలోని లక్ష్మీనగర్ కాలనీకి చెందిన హర్షవర్ధన్ అనే రెండేళ్ల చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటుండగా, ఒక్కసారిగా వీధి కుక్కల గుంపు దాడి చేసింది. కుక్కలు విచక్షణారహితంగా కరవడంతో హర్షవర్ధన్ తలకు ,శరీరానికి తీవ్ర గాయాలయ్యాయి. భయంతో హర్షవర్ధన్ అరుపులు విని కుటుంబ సభ్యులు వెంటనే బయటకు వచ్చి కుక్కలను తరిమికొట్టారు. 

రక్తపు మడుగులో ఉన్న హర్షవర్ధన్‌ను చికిత్స నిమిత్తం వెంటనే మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారికి వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. వరుసగా జరుగుతున్న కుక్కల దాడులతో కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి వీధి కుక్కల బెడదను అరికట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.