మాదాపూర్‌లో భారీగా హ్యాష్ ఆయిల్ సీజ్..పోలీసుల వలలో కారు మెకానిక్

మాదాపూర్‌లో భారీగా హ్యాష్ ఆయిల్ సీజ్..పోలీసుల వలలో కారు మెకానిక్

హైదరాబాద్ నగరంలో డ్రగ్ విక్రయాలకు చెక్ పెడుతున్నారు పోలీసులు. తాజాగా మాదాపూర్ లో భారీగా హ్యాష్ ఆయిల్‌ను పట్టుకున్నారు. కారు మెకానిక్ ముసుగులో డ్రగ్స్ సరఫరా చేస్తున్న కర్నూలు యువకుడిని అయ్యప్ప సొసైటీ దగ్గర అరెస్ట్ చేశారు. నిందితుడినుంచి  920 గ్రాముల హ్యాష్ ఆయిల్‌ను సీజ్ చేశారు. వివరాల్లోకి వెళితే..

మార్చి 19న మాదాపూర్ లోని అయ్యప్ప సొసైటీ రోడ్డులో తనిఖీలు చేపట్టిన పోలీసులు.. అనుమానాస్పదంగా తిరుగుతున్న కర్నూలుకు చెందిన పరుసముల దినేష్ (28)ను అదుపులోకి తీసుకున్నారు.నిందితుడి నుంచి సుమారు 920 గ్రాముల హ్యాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. 

చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాల్లో  (మొత్తం 184 డబ్బాలు )ప్యాక్ చేసిన ఈ డ్రగ్స్ ను విక్రయించేందు ప్రయత్నిస్తుండగా పట్టుకున్నారు. పట్టుకున్న హాష్ ఆయిల్  విలువ మార్కెట్లో సుమారు రూ. 4లక్షల 50వేలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.  కారు మెకానిక్‌గా పనిచేస్తున్న దినేష్, సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో డ్రగ్స్ అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. నిందితుడిపై NDPS చట్టం కింద కేసు నమోదు చేసి, దీని వెనుక ఉన్న ప్రధాన సూత్రధారుల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.