రూ. 41 వేల కోట్లతో రైల్వే ప్రాజెక్టులు

రూ. 41 వేల కోట్లతో రైల్వే ప్రాజెక్టులు
  • 27 రాష్ట్రాల్లో 554 అమృత్ స్టేషన్ల పనులకు 
  • వర్చువల్​గా ప్రధాని మోదీ శంకుస్థాపన
  • స్థానిక సంస్కృతిని చాటేలా పునరుద్ధరణ పనులు   
  • దేశ యువత స్వప్నమే నా సంకల్పం
  • జూన్​లో మూడోసారీ తమ ప్రభుత్వమే వస్తదని ధీమా

న్యూఢిల్లీ: అభివృద్ధి చెందిన ఇండియా (వికసిత్ భారత్) అంటే.. దేశ యువత కలలు కనే భారత దేశమేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశ భవిష్యత్తు ఎలా ఉండాలనేది నిర్ణయించే హక్కు నేడు యువతకే ఉందన్నారు. అందుకే యువత స్వప్నాలను సాకారం చేయడమే తన సంకల్పమని ప్రకటించారు. అమృత్ భారత్ స్టేషన్స్ పథకం కింద సోమవారం దేశవ్యాప్తంగా 27 రాష్ట్రాల్లో 300 జిల్లాల్లోని 554 రైల్వే స్టేషన్ల పునరుద్ధరణ కోసం చేపట్టిన రూ. 41 వేల కోట్ల విలువైన 2 వేల రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు ప్రధాని వర్చువల్ గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. 

కార్యక్రమంలో ఆయా రాష్ట్రాల్లో సీఎంలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం దేశవ్యాప్తంగా 2000 రైల్వే స్టేషన్లు, ఇతర ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన ఫంక్షన్లలో ప్రధాని వర్చువల్ గా మాట్లాడారు. ‘‘వికసిత్ భారత్ ఎలా ఉండాలనేది నిర్ణయించడంలో నేడు యువతీయువకులదే కీలక పాత్ర. అందుకే ప్రతి ఒక్క యువతికి, యువకుడికీ చెప్తున్నా.. మీ స్వప్నాన్ని సాకారం చేసేందుకు నేను సంకల్పం తీసుకుంటున్నా. మీ కల, శ్రమ, నా సంకల్పం.. ఇవే వికసిత్ భారత్ కు గ్యారంటీ” అని మోదీ చెప్పారు. 

‘ఇండియా ఇప్పుడు మునుపెన్నడూ లేనంత వేగంగా అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. మనం ఇప్పుడు పెద్ద పెద్ద కలలు కంటున్నాం. ఆ కలలను నిజం చేసుకునేందుకు రాత్రీ పగలూ అలుపులేకుండా శ్రమిస్తున్నాం. ఈ సంకల్పమే వికసిత్ భారత్- –వికసిత్ రైల్వే ప్రోగ్రాంలోనూ స్పష్టంగా కనిపిస్తోంది’ అని అన్నారు. ‘‘2047: వికసిత్ భారత్ కీ రైల్వే” పేరుతో నిర్వహించిన కాంపిటీషన్లలో యువత భారీ సంఖ్యలో పాల్గొన్నారని ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు.

జూన్​లో నా ప్రభుత్వం మూడోసారి వస్తది.. 

వచ్చే జూన్ లో తన ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వస్తుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా కొత్త ప్రాజెక్టులు, పనులు శరవేగంగా జరుగుతుండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోందన్నారు. దేశ ప్రజలు గత పదేండ్లలో కొత్త ఇండియా నిర్మాణం జరుగుతుండటాన్ని చూశారన్నారు. గత రెండ్రోజుల్లోనే జమ్మూకాశ్మీర్, గుజరాత్ నుంచి తాను వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టానన్నారు. 

12 ఐఐటీలు, 5 ఎయిమ్స్ లను జాతికి అంకితం చేశానని చెప్పారు. రైల్వేలతోపాటు ఎడ్యుకేషన్, హెల్త్ సెక్టార్ లను కూడా గణనీయంగా విస్తరిస్తున్నామన్నారు. గత ప్రభుత్వాల హయాంలో జరిగిన అవినీతికి తాము అడ్డుకట్ట వేశామని.. రైల్వేలో ప్రజాధనం లూటీ కాకుండా సంపాదించిన ప్రతి పైసానూ రైల్వే సర్వీసుల విస్తరణకే ఖర్చు చేస్తున్నామన్నారు. గతంలో రైల్వేకు ఎప్పుడూ ఆర్థిక నష్టాలే ఉండేవని.. కానీ తాము రైల్వేను ఇప్పుడు శక్తిమంతంగా మార్చామన్నారు. 

మనం బ్యాంకుల్లో జమ చేసుకున్న డబ్బులకు వడ్డీని సంపాదించినట్లుగానే.. మౌలిక వసతుల సృష్టికి ఖర్చు చేసే ప్రతి పైసా కూడా కొత్త ఆదాయ, ఉపాధి మార్గాలను సృష్టిస్తుందన్నారు. కొత్తగా రైల్వే ట్రాకులు వేయడం ద్వారా లేబర్ నుంచి ఇంజనీర్ల వరకూ అనేక రంగాల వారికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.

లోకల్ కల్చర్ చాటేలా ‘అమృత్’ స్టేషన్లు.. 

అమృత్ భారత్ స్టేషన్ల పథకంలో భాగంగా ఎక్కడికక్కడ స్థానిక కల్చర్​ను ప్రతిబింబించేలా మార్పులు చేస్తున్నామని ప్రధాని చెప్పారు. ఒడిసాలోని బాలాసోర్ స్టేషన్​ను పూరి జగన్నాథ్ టెంపుల్ థీమ్​తో డిజైన్ చేశామని, సిక్కింలోని రంగపూర్ స్టేషన్​లో స్థానిక ఆర్కిటెక్చర్ విధానాన్ని పాటించామన్నారు. రాజస్థాన్ లోని సంగ్నర్ స్టేషన్​లో 16వ శతాబ్దంనాటి హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్, తమిళనాడులోని కుంభకోణం స్టేషన్ ను చోళుల కళా నైపుణ్యం ఉట్టిపడేలా తీర్చిదిద్దామన్నారు. 

అలాగే అహ్మదాబాద్ స్టేషన్​ను మోధెరా సన్ టెంపుల్, ద్వారక స్టేషన్ ను ద్వారకాధీశ్ టెంపుల్ థీమ్ తో కొత్తగా మార్చామన్నారు. ఇప్పటివరకూ 1,318 స్టేషన్లను ఈ స్కీం కింద ఎంపిక చేశామని తెలిపారు. కాగా, జమ్మూకాశ్మీర్​లోని కత్రా సిటీలో ఉన్న మాతా వైష్ణో దేవి రైల్వే స్టేషన్ ను రూ.40 కోట్లతో విస్తరించే ప్రాజెక్టుకు కూడా ప్రధాని శంకుస్థాపన చేశారు.

దేశ అభివృద్ధిలో టెక్స్ టైల్ రంగం కీలకం

భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిలిచేందుకు టెక్స్​టైల్ సెక్టార్ కూడా కీలకమని ప్రధాని మోదీ అన్నారు. సోమవారం ఢిల్లీలోని భారత్ మండపంలో ‘భారత్ టెక్స్ 2024’ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘‘వచ్చే 25 ఏండ్లలో భారత్​ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు సంకల్పించాం. వికసిత్ భారత్​కు పేదలు, యువత, రైతులు, మహిళలే మూలస్తంభాలు. వీరందరికీ టెక్స్​టైల్ సెక్టార్​తో సంబంధం ఉంది. 

అందుకే ఈ రంగం మనకు ఎంతో ముఖ్యమైనది” అని ప్రధాని చెప్పారు. 2014కు ముందు దేశంలో టెక్స్​టైల్ రంగం విలువ రూ. 7 లక్షల కోట్లలోపే ఉండగా.. ప్రస్తుతం అది రూ. 12 లక్షల కోట్లకు చేరిందన్నారు. గత పదేండ్లలో నూలు, దారాలు, వస్త్రాల ఉత్పత్తి 25% పెరిగిందన్నారు. టెక్స్​టైల్ రంగం అభివృద్ధికి తమ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. కాగా, నాలుగు రోజులు జరిగే భారత్ టెక్స్ 2024 ఎగ్జిబిషన్ లో 3,500కు పైగా ఎగ్జిబిటర్లు, 100 దేశాల నుంచి 3 వేలకు పైగా బయ్యర్లు, 40 వేలకుపైగా బిజినెస్ విజిటర్లు, స్టూడెంట్లు, నేత కార్మికులు, కళాకారులు, గ్లోబల్ సీఈవోలు పాల్గొంటారు.