‘కులగణన’ను వ్యతిరేకిస్తున్న బీజేపీ ప్రభుత్వం

 ‘కులగణన’ను వ్యతిరేకిస్తున్న బీజేపీ ప్రభుత్వం

భారత ప్రభుత్వం 2026  హౌస్ లిస్టింగ్  నోటిఫికేషన్  విడుదల చేయడంతో  దేశంలో  మళ్లీ కులగణన అలజడి మొదలైంది. 2024 లోక్​సభ  ఎన్నికలలో  కులగణన, సామాజిక న్యాయం, రిజర్వేషన్లు మొదటిసారి జాతీయ స్థాయిలో ఎన్నికల ఎజెండాగా ముందుకు వచ్చింది.  ముఖ్యంగా రాహుల్ గాంధీ నాయకత్వంలో జాతీయస్థాయిలో ఈ చర్చ బలంగా ముందుకుపోయింది. అదేవిధంగా అఖిలేష్ యాదవ్ నాయకత్వంలో ఉత్తరప్రదేశ్​లో  ఈ చర్చ సాగింది.  బిహార్లో,  తమిళనాడులో  అదేవిధంగా కొన్ని రాష్ట్రాలలో కూడా సామాజిక అంశం కేంద్రంగా ఎన్నికలకు పోవడం మనకు కనిపిస్తోంది.  మొదటి నుంచి  బీజేపీ, ఆర్ఎస్ఎస్ కులగణనను అడ్డుకుంటూ  వచ్చాయి. 

స్వాతంత్ర్యం అనంతరం 1951 సెన్సెస్ లో  ఎస్సీ,  ఎస్టీలు తప్ప మిగిలిన కులాల వివరాలు సేకరించేందుకు  కేంద్ర ప్రభుత్వం  నిరాకరించింది.  పలు బ్యాక్వర్డ్  క్లాస్  కమిషన్లు  కులగణన జరగాలని రిపోర్ట్ ఇచ్చినప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోలేదు.  రిజర్వేషన్ సమస్య దేశం ముందు వచ్చినప్పుడు కులగణన ఆధారిత డేటా లేకుండా సమర్పించిన  ప్రతి రిపోర్టును కోర్టులు కొట్టివేశాయి.  చివరికి 1931 కులగణన ఆధారంగా తయారుచేసిన మండల కమిషన్ రిపోర్టును మాత్రం సుప్రీంకోర్టు అంగీకరించింది.  దాంతో మొదటిసారి 1993లో  ఓబీసీ అనే గుర్తింపుతోపాటు ఉద్యోగాలలో రిజర్వేషన్లను  కేంద్రంలో అమలు చేయడం జరిగింది. ఓబీసీ రిజర్వేషన్లపై జరిగిన మండల ఉద్యమాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది.  

బీసీల  రిజర్వేషన్లను  సిఫార్సు చేసిన మండల కమిషన్ అమలును రామ మందిరం ఉద్యమంతో బీజేపీ పెద్ద ఎత్తున అడ్డుకున్నది. 1997లో సోషలిస్టుల  నాయకత్వంలోని  జనతాదళ్ ప్రభుత్వం కులగణన జరపాలని  కేంద్ర కేబినెట్  నిర్ణయం తీసుకున్నది.  అనంతరం ఏర్పాటైన బీజేపీ  ప్రభుత్వం కులగణనను వ్యతిరేకించింది. సెన్సస్  కమిషనర్  కులగణనను సిఫార్సు చేసినప్పటికీ అద్వానీ నాయకత్వంలో దాన్ని పెట్టినారు.  దాంతో  2001లో  జరిగిన జనాభా లెక్కలలో కులాల ఆధారిత సామాజిక, ఆర్థిక స్థితిగతులను తెలిపే వివరాలను దేశం ముందుకురాకుండా అడ్డుకోవడం జరిగింది.  

కులగణనపై బీజేపీ దోబూచులాట

2010లో  ప్రతిపక్ష పార్టీలు  కాంగ్రెస్ మీద  ఒత్తిడి  తీసుకొచ్చి కులగణనను జరపాలని అన్నప్పుడు బీజేపీ కూడా మద్దతు ఇచ్చింది. అయితే సోషల్ ఎకనామిక్ కాస్ట్  సెన్సెస్ లో భాగంగా వచ్చిన రిపోర్టును 2015లో  బీజేపీ ప్రభుత్వం రిజెక్ట్  చేసింది.  మళ్ళీ 2018లో బీసీ గణన చేస్తామని బీజేపీ  ప్రకటించింది. 2019 ఎన్నికలు  అయిన తర్వాత అదే బీజేపీ  ప్రభుత్వం సుప్రీంకోర్టు ముందు అఫిడవిట్ సమర్పిస్తూ కులగణన చేయడం సాధ్యం కాదు అంటూ వాదించింది. చివరకు 2024 ఎన్నికలలో  కులగణన, సామాజిక న్యాయం, రిజర్వేషన్లు  జాతీయ ఎన్నికల ఎజెండా కావడంతో  బీజేపీ మెజారిటీ అంచులకు  రాకుండా పోయింది.  చివరకు తప్పనిపరిస్థితులలో ఆర్ఎస్ఎస్, బీజేపీలు కులగణనకు అనుకూలంగా ప్రకటించడం జరిగింది. దాంట్లో భాగంగా 2026-–27లో జరిగే  జనాభా లెక్కలలో  కులగణన చర్చ మొదలయింది.

33 అంశాల  ప్రశ్నావళి

జాతీయస్థాయిలో తలపెట్టిన కులగణన ప్రక్రియను హోం మినిస్ట్రీ  మొదలుపెట్టింది.  ఈ ప్రక్రియ రెండు దశలలో జరుగుతుంది.  ఏప్రిల్– -సెప్టెంబర్ 2026లో  హౌస్ లిస్టింగ్ హౌసింగ్ సెన్సెస్ జరగనుంది. అందుకోసం 33 అంశాలకు  చెందిన  ప్రశ్నావళిని రిజిస్టర్ జనరల్ మరియు సెన్సెస్  కమిషనర్  హోంశాఖలో భాగంగా విడుదల చేయడం జరిగింది.  ఈ  నోటిఫికేషన్ లో  లోపాలను కాంగ్రెస్, సమాజ్​వాదీ పార్టీలు  ప్రశ్నించాయి.  ముఖ్యంగా అన్ని కులాలకు  సంబంధించిన వివరణ  లోపించిందని  ప్రశ్నించడమైనది.  ఈ ప్రశ్నావళిలో ఎస్సీ, ఎస్టీ, ఇతరులు అని మాత్రమే కనిపిస్తున్నాయి. వెనుకబడిన తరగతుల 

గురించిగానీ,  జనరల్ కులాల గురించిగానీ ఎలాంటి వివరణ లేదు.  అంటే  కాస్ట్  సెన్సెస్​ను  కుదించివేసి మొదటి దశ కొనసాగించేవిధంగా కనిపిస్తోంది.  మరోవైపు  ప్రజలను  దేశాన్ని స్పెక్యులేషన్​లో  పెడుతూ  ప్రభుత్వవర్గాలు  జనాభా గణనలో  వివరాలతో కూడిన మెథడాలజీని  డెవలప్ చేస్తున్నామని అంటున్నట్లు  పత్రికలలో  రాయడం జరిగింది.  ఇదంతా చూస్తుంటే బీజేపీ నాయకత్వంలోని  కేంద్ర ప్రభుత్వం దేశాన్ని దారి మళ్ళించే  కుట్ర చేస్తున్నట్లు కనిపిస్తుంది.  


33 అంశాలను వివరించే  నోటిఫికేషన్​లో  బహుశా మొదటి పేజీలో  అవసరం లేదు అనే విధంగా ప్రభుత్వం ప్రకటిస్తున్నట్లు ఉన్నది. ఇది సరైనది కాదు.  ప్రతి పది సంవత్సరాలకు జరిగే  కులగణన రెండు  దశలుగా  జరపడం ఆనవాయితీగా  వస్తోంది.  మొదటి దశ హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ అయితే రెండో దశ  పాపులేషన్  ఎన్యూమరేషన్  జరుగుతుంది.  కులగణన వివరాలు  రెండు దశలలో  ఉన్నప్పుడు  మాత్రమే  సమగ్రమైన  వివరాలతో  కులాల  స్థితిగతులను తెలుసుకోవడానికి వీలుంటుంది.  మొదటి దశలో  కులాలతో కూడిన  ప్రశ్నావళి ఉంటే  సామాజిక  ఆర్థికస్థితిని  సమగ్రంగా తెలియజేస్తుంది. బహుశా బీజేపీకి  సమగ్ర  రిపోర్టును  దేశం  ముందుకు తీసుకురావడానికి ఇష్టం లేనట్లు కనిపిస్తోంది.

కుటుంబ స్థితిగతులు

33 అంశాలతో కూడిన నోటిఫికేషన్లు క్లుప్తంగా చూస్తే ఇందులో ముఖ్యంగా ఎన్యూమరేటర్  ఇల్లును సందర్శించినప్పుడు ఇంటి ఫ్లోర్  ఎలాంటి మెటీరియల్ వాడారు.  పైకప్పుకు  ఏ మెటీరియల్ ఉపయోగించారు. ఆ ఇంట్లో ఎంతమంది  ఉన్నారు.  ఆ ఇంటి యజమాని  ఎస్సీనా?   ఎస్టీనా?  ఇతరులా  అనే వివరాలను తెలుసుకుంటారు.  అదేవిధంగా ఆ ఇంటి ఓనర్ అతనేనా, కాదా కూడా తెలుస్తుంది.  ఆ ఇంట్లో  ఎన్ని గదులు ఉన్నాయి.  ఎంతమంది పెళ్లి చేసుకున్న  జంటలు ఉన్నారు.  తాగునీరు ఎక్కడి నుంచి వస్తుంది. కిచెన్ ఉన్నదా  మొదలైన  అన్ని వివరాలు తెలుసుకుంటారు.  

ఇంట్లో  రేడియో,  ట్రాన్సిస్టర్,  టీవీ,  ఇంటర్నెట్, లాప్​టాప్,  కంప్యూటర్,   స్మార్ట్​ఫోన్,  బైసికిల్, మోటార్ సైకిల్  గురించి  కూడా తెలుసుకుంటారు. వాళ్ళు ముఖ్యంగా తినే ఆహారం గురించి కూడా తెలుసుకుంటారు. పై వివరాలు అన్నిటిని మనం ఒకసారి చూస్తే మనకు స్పష్టంగా వాటి ద్వారా ఆ కుటుంబం  స్థితిగతులను అభివృద్ధిని,  వెనకబాటుతనాన్ని  తెలియజేస్తున్నాయి.  ఉదాహరణకు  ఫ్లోర్ టైల్స్​తో  కూడుకున్నదా,  మార్బులా, గ్రానైటా, షాబాద్ స్టోనా, మట్టితో ఉన్నదా అనే వివరాలతో కుటుంబ,  కులాల అభివృద్ధి వెనుకబాటుతనాన్ని తెలుసుకోవచ్చు.  కానీ,  కులం ఇవ్వకపోవడంతో ఈ వివరాలు బయటకువచ్చే అవకాశం లేదు.  

సమగ్ర కులగణన చేపట్టాలి

అదేవిధంగా  ఆ ఇల్లు సొంతమా లేక  కిరాయికి ఉన్నాడా అనే విషయం కూడా  తెలియజేస్తుంది. ఆ కుటుంబం ఎన్ని గదులులో ఉంటున్నారు.   ఎన్ని పెళ్లయిన జంటలు ఉన్నాయి  అనేదాన్ని బట్టి  కుటుంబ పేదరికం కూడా అంచనా వేయవచ్చు.  టీవీలు, ఇంటర్నెట్,  కంప్యూటర్లు, లాప్​టాప్,  స్మార్ట్ ఫోన్లు,  టీవీలు,  మోటార్ సైకిళ్లు,   కార్లు ఉన్న కుటుంబాలు  ఏ కులంలో  ఎక్కువ ఉన్నాయి  లేక  తక్కువ ఉన్నాయి అనే వివరాలు  చూపించడానికి కులం అనే కాలంను  హౌస్ హోల్డ్ ఆపరేషన్లలో  చూపించాల్సి ఉండె.  కానీ,   ప్రభుత్వం  కులాల  వివరాలపై గల వ్యతిరేకతను ఏవో  సాకులు  రూపంలో  దాటవేసే  ప్రయత్నం  చేస్తున్నట్లు  స్పష్టంగా  కనిపిస్తుంది.  కులగణనను  సమగ్రంగా  దేశం ముందరపెట్టడానికి బీజేపీ  నిరాకరిస్తున్నట్టు  కనిపిస్తుంది.  ఇది చాలా దురదృష్టకరం.

దేశ బడ్జెట్​ను   సామాజిక  వెనుకబాటుతనాన్ని కేంద్రంగా పంపిణీ చేస్తే  అది  సమగ్ర  అభివృద్ధికి తోడ్పడుతుంది. జాతీయస్థాయి రీసెర్చ్ అండ్  ప్లానింగ్  సంస్థలు,  ప్రభుత్వ విభాగాలు వాటిని ఉపయోగించుకొని అభివృద్ధి పథకాలను రక్షించవచ్చు. ఎవరి దగ్గర పక్కా బంగ్లాలు ఉన్నాయి. అవి వివిధ ప్రాంతాలలో ఏవిధంగా ఉన్నాయి అనే వివరాలు అభివృద్ధిని సూచిస్తాయి.  కచ్చా  ఇండ్లు  సామాజికవర్గాలవారీగా  చూపిస్తే  పేదరికం వెనుకబాటుతనం ఎంతవరకు  ఉన్నదో  కూడా  తెలుస్తుంది. 

 బీజేపీ  నాయకత్వంలోని  కేంద్ర ప్రభుత్వం  జరిగిన  తప్పును  గుర్తించి  సవరించుకోవాలి.  ఫిబ్రవరి 2 నుంచి 25 వరకు  జరిగే  రెండో దశ  ఎన్యూమరేషన్​లో  కులం  చేరుస్తామనడం  దేశాన్ని తప్పుదారి పట్టించడమే. మొదటి నుంచి  వస్తున్న వారి  కులగణన  వ్యతిరేకతను  ప్రదర్శించడమే. బీజేపీ  తన రెండు నాలుకల 
ధోరణిని  పక్కకు పెట్టాలి.  రెండు దశలలో కూడా కులాన్ని చేర్చి  సమగ్ర  కులగణనను చేపట్టాలి.

- ప్రొఫెసర్  సింహాద్రి సోమనబోయిన, 
రాష్ట్ర అధ్యక్షుడు,
 సమాజ్​వాది పార్టీ, తెలంగాణ