రాష్ట్రంలో వచ్చేది బీజేపీ సర్కారే.. మమ్మల్ని గెలిపించే జిమ్మెదారి రైతులదే: అర్వింద్

రాష్ట్రంలో వచ్చేది బీజేపీ సర్కారే.. మమ్మల్ని గెలిపించే  జిమ్మెదారి రైతులదే: అర్వింద్

మెట్ పల్లి, వెలుగు: నెల రోజుల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం బీజేపీ గాలి వీస్తుందని.. కోరుట్ల నియోజకవర్గం నుంచే ఆ ప్రభంజనం షురూ కావాలని నిజామాబాద్ ఎంపీ, కోరుట్ల బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ అన్నారు. రాష్ట్రంలో సీఎం నుంచి లోకల్ బాడీస్ వరకు అంతా  బీజేపీ అధికారంలోకి రావడం పక్కా అన్నారు. రైతుల సంక్షేమ కోసం పసుపు బోర్డు ఏర్పాటు, పీఎం సమ్మాన్ నిధి, ఎరువులపై ఎకరాకు రూ.18 వేల సబ్సిడీ ఇస్తున్న బీజేపీని గెలిపించే జిమ్మెదారి రైతుల మీదనే ఉందన్నారు. సోమవారం ఇబ్రహీంపట్నం మండలం యామపుర్, మెట్ పల్లి మండలం జగ్గసాగర్ గ్రామాల్లో బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

ఈసందర్భంగా అర్వింద్ ​మాట్లాడుతూ ‘సీఎం కేసీఆర్ కు తెల్వకుండా ఆయన కొడుకు కేటీఆర్, బిడ్డ కవిత కమీషన్లు దండుకుని ముసలాయనను పరేషాన్ జేస్తున్నరు. దీంతో కేసీఆర్ ఆగమాగం అయితున్నడు’ అని అన్నారు. కార్యకర్తలు రొటీన్ రాజకీయాలు బంద్ చేసి  లేటెస్ట్ సోషల్ మీడియా రాజకీయాలు చేయాలన్నారు. కోరుట్ల నియోజకవర్గంలో అసంపూర్తి పనులు, హామీలు ఇచ్చి నెరవేర్చని పనులపై వినూత్నంగా వీడియోలు, ఫొటోలు తీసి ప్రచారం చేసి సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు. బీజేపీ సర్కారు అధికారంలోకి రాగానే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో లక్ష ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు.