అవ్యవస్థీకృత రంగాన్ని బీజేపీ నాశనం చేసింది: రాహుల్

అవ్యవస్థీకృత రంగాన్ని బీజేపీ నాశనం చేసింది: రాహుల్

న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిందని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ విమర్శించారు. మోడీ సర్కార్ అవ్యవస్థీకృత రంగాన్ని నాశనం చేసిందని ఆరోపించారు. ప్రజలను బానిసలుగా మార్చే యత్నం జరిగిందన్నారు. ఎకానమీని మోడీ ప్రభుత్వం ఏ విధంగా నాశనం చేసిందో వివరిస్తూ రాహుల్ 3.38 నిమిషాల వీడియోను తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో విడుదల చేశారు. 2008లో మొత్తం ప్రపంచం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడిందన్నారు. ఈ జాబితాలో అమెరికా, యూరోప్, జపాన్, చైనా కూడా ఉన్నాయని చెప్పారు.

‘ఆ సమయం (2008)లో ఇండియాలో యూపీఏ అధికారంలో ఉంది. మొత్తం ప్రపంచం ఆర్థిక సంక్షోభంతో తల్లడిల్లుతున్నా ఇండియాపై ఆ ప్రభావం ఎందుకు పడలేదని అప్పటి ప్రధాని మన్మోహన్ జీని అడిగా. బదులుగా.. ఇండియా ఎకానమీలో రెండు నిర్మాణాలు ఉన్నాయని.. ఒకటి వ్యవస్థీకృత, మరొకటి అవ్యవస్థీకృత రంగమని ఆయన చెప్పారు. వ్యవస్థీకృత రంగంలో బడా కంపెనీలు ఉంటాయి. అవ్యవస్థీకృత రంగంలోకి రైతులు, కూలీలు, ఎంఎస్ ఎంఈలు వస్తారు. ఇండియాలో అవ్యవస్థీకృత రంగం బలంగా ఉన్నంత వరకు ఎలాంటి ఆర్థిక పిడుగులు మన దేశాన్ని ఏమీ చేయలేవు. కానీ గత 6 సంవత్సరాల్లో బీజేపీ గవర్నమెంట్ అవ్యవస్థీకృత రంగంపై దాడి చేసింది. దీనికి పెద్ద నోట్ల రద్దు, తప్పుడు జీఎస్టీ, కరోనాను నియంత్రించడానికి విధించిన లాక్ డౌన్ లే ఉదాహరణలు . లాక్ డౌన్ ప్లాన్ లేకుండా వేసిందని భావించడం లేదు. అది చివరి క్షణంలో తీసుకున్న నిర్ణయంలా కనిపించడం లేదు. ఈ మూడు నిర్ణయాల ఫలితమే అవ్యవస్థీకృత రంగం నాశనమవడం’ అని రాహుల్ పేర్కొన్నారు.