సెకండ్ లిస్ట్​పై నడ్డా, షా మీటింగ్​

సెకండ్ లిస్ట్​పై నడ్డా, షా మీటింగ్​
  • హాజరైన కిషన్ రెడ్డి, రాష్ట్ర ఇన్​చార్జ్​ చుగ్, బన్సల్, చంద్రశేఖర్

న్యూఢిల్లీ, వెలుగు : ఫస్ట్ లిస్ట్ లో 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ, మిగిలిన ఎనిమిది స్థానాలపై ఫోకస్ పెట్టింది. ఈ అంశంపై చర్చించేందుకు ఢిల్లీకి రావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి అగ్రనేత అమిత్ షా ఆఫీసు నుంచి పిలుపు అందింది. దీంతో కిషన్​రెడ్డి హుటాహుటిన శనివారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. రాత్రి 11 గంటల తర్వాత దీన్ దయాళ్ మార్గ్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో

నడ్డా, అమిత్ షా నేతృత్వంలో కీలక భేటీ జరిగింది. ఇందులో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఇన్​చార్జీలు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, చంద్ర శేఖర్, ఇతర ఆర్గనైజేషన్ ముఖ్య నేతలు మాత్రమే పాల్గొన్నారు. తెలంగాణలో ఇప్పటికే ప్రకటించిన తొమ్మిది స్థానాల్లో ప్రచారం, మిగిలిన ఎనిమిది స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై చర్చించారు. అలాగే పార్టీలో జాయినింగ్స్ పై సుదీర్ఘంగా మంతనాలు జరిపారు.

మహబూబ్ నగర్ సీటుపై షా ఆరా 

పార్టీ జాతీయ నేతలు డీకే అరుణ, జితేందర్ రెడ్డి పోటీ పడుతున్న మహబూబ్‌నగర్ స్థానంలో వాస్తవ పరిస్థితులపై ఈ భేటీలో అమిత్​ షా ఆరా తీసినట్లు సమాచారం. ఎవరికి సీటు కేటాయిస్తే.. పార్టీ గెలుపునకు దోహదపడుతుందనే అంశాన్ని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా మెదక్ లోక్ సభ అభ్యర్థిపైనా స్పష్టత వచ్చినట్టు తెలిసింది.  

నేడు ఢిల్లీకి సీతారాంనాయక్ 

ప్రధానంగా బీఆర్ఎస్ మాజీ ఎంపీలు సీతారాంనాయక్, నగేశ్​, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావ్, సైదిరెడ్డి, అరూరి రమేశ్, ఉద్యమ గాయకుడు మిట్టపల్లి సురేందర్ చేరికలపై  భేటీలో చర్చించారు. పార్టీ ప్రత్యేక సభల ద్వారా జాయినింగ్స్ చేపట్టాలని అధిష్టానం యోచిస్తున్నట్లు తెలిసింది. అయితే మాజీ ఎంపీనైనా తాను ఢిల్లీలోనే పార్టీ పెద్దల సమక్షంలో చేరుతానని సీతారాంనాయక్​ పట్టుబడుతున్నట్లు తెలిసింది. దీంతో ఆయన నేడు ఢిల్లీ కి రానున్నట్లు విశ్వసనీయ సమాచారం.