ఆరూరికి వరంగల్​.. తాండ్రకు ఖమ్మం

ఆరూరికి వరంగల్​.. తాండ్రకు ఖమ్మం

మిగిలిన రెండు స్థానాలకు బీజేపీ అభ్యర్థుల ఖరారు
దేశవ్యాప్తంగా 111  మందితో ఐదో  లిస్ట్ రిలీజ్
ఏపీ నుంచి 6  స్థానాలకు అభ్యర్థుల ప్రకటన


న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో మిగిలిన రెండు లోక్ సభ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. వరంగల్ టికెట్​ను ఆరూరి రమేశ్​కు,  ఖమ్మం సీటు- తాండ్ర వినోద్ రావుకు కేటాయించింది. ఆంధ్రప్రదేశ్ లో 6 సీట్లకు క్యాండిడేట్లను ప్రకటించింది. ఈ మేరకు  బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ ఆదివారం 111 మంది అభ్యర్థులతో కూడిన ఐదో లిస్ట్​ను  విడుదల చేశారు. ఏపీ, తెలంగాణ, బిహార్, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్​ ప్రదేశ్​, జార్ఖండ్, కర్నాటక, కేరళ, మహారాష్ట్ర, మిజోరాం, ఒడిశా, రాజస్థాన్, సిక్కిం, యూపీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి అభ్యర్థులను ఖరారు చేసింది. తాజా లిస్ట్ తో ఇప్పటివరకు బీజేపీ ప్రకటించిన ఎంపీ అభ్యర్థుల సంఖ్య 402 కు చేరింది. తొలి జాబితాలో 195 మంది అభ్యర్థులు, రెండో జాబితాలో 72 మంది, మూడో జాబితాలో 9 మంది, నాలుగో జాబితాలో 15 మంది, ఐదో జాబితాలో 111 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.

చివరి వరకూ ఉత్కంఠ 

తొలి జాబితాలోనే  బీజేపీ తెలంగాణ నుంచి తొమ్మిది మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో ముగ్గురు బీజేపీ సిట్టింగ్ ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, అర్వింద్, ఒకరు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్, మరో సిట్టింగ్ ఎంపీ కుమారుడు పోతుగంటి భరత్, ముగ్గురు బీఆర్ఎస్ మాజీ  నేతలు ఈటెల రాజేందర్​, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బూర నర్సయ్యగౌడ్​, మాధవీలతకు అవకాశం కల్పించింది. అనంతరం సెకండ్ లిస్ట్ లో ఆదిలాబాద్ బీజేపీ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావును పక్కన పెట్టి, బీఆర్ఎస్ నుంచి వచ్చిన నగేశ్​కు చోటు కల్పించింది.

అలాగే, సీతారాం నాయక్, సైదిరెడ్డి, గోమాసే శ్రీనివాస్​ పేర్లు ప్రకటించింది. ఫస్ట్ లిస్ట్ లో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేరును ప్రకటించకుండా సస్పెన్స్ లో పెట్టిన అధిష్టానం.. సెకండ్ లిస్ట్ లో మహబూబ్ నగర్ నుంచి ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. మొదటి నుంచి హాట్ టాపిక్ గా ఉన్న ఖమ్మం, వరంగల్ స్థానాల అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠను కొనసాగించింది. చివరగా బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఆరూరి రమేశ్​కు వరంగల్ సీటు కేటాయించింది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్ కు ఖమ్మం సీటు కన్ఫామ్ అని భావించినా.. ఆయన అక్కడ పోటీ చేసేందుకు విముఖత చూపినట్టు తెలిసింది. దీంతో ముందు నుంచి ఈ సీటు కోసం పోటీపడుతున్న బిజినెస్ మెన్ తాండ్ర వినోద్ రావు వైపు బీజేపీ అధిష్టానం మొగ్గు చూపింది. 

ఏపీ బీజేపీ నుంచి కాంగ్రెస్ మాజీ సీఎం పోటీ

ఐదో లిస్ట్ లో ఏపీకి చెందిన ఆరు స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. రాజంపేట నుంచి ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీ అవకాశం కల్పించింది. అలాగే, ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరిని  రాజమండ్రి నుంచి బరిలో నిలిపింది. అరకు నుంచి కొత్తపల్లి గీత,  అనకాపల్లి నుంచి సీఎం రమేశ్, నర్సాపురం నుంచి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, తిరుపతినుంచి వరప్రసాద్​కు అవకాశం కల్పించింది. 

ఎవరీ వినోద్ రావు?

ఖమ్మం, వెలుగు: వెలమ సామాజికవర్గానికి చెందిన తాండ్ర వినోద్ రావు స్వస్థలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం తిమ్మంపేట. 1930లో వినోద్ రావు తాత సుదర్శన్ రావు భద్రాచలం రామాలయం ట్రస్టీగా పనిచేశారు. ఆ హోదాలో ముత్యాల తలంబ్రాలు సమర్పించేవారు. వినోద్ రావు తండ్రి కృష్ణారావు పాల్వంచలో వకీల్ గా పనిచేసి వకీల్ రావుగా పేరుపొందారు. ఇంటర్ వరకు పాల్వంచలో చదివిన వినోద్ రావు, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశారు. 20 ఏండ్ల నుంచి హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగంలో స్థిరపడి, పలు వ్యాపార సంస్థల్లో భాగస్వామిగా ఉన్నారు. ఏకలవ్య ఫౌండేషన్ ద్వారా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు సన్నిహితుడిగా ఉన్న ఆయన, ఈ ఏడాది ఫిబ్రవరిలోనే బీజేపీలో చేరారు. ఈటెల సపోర్ట్ తోనే వినోద్ రావు కు ఖమ్మం టికెట్ దక్కినట్టు తెలుస్తున్నది. 

జలగం భవిష్యత్ అయోమయం

జలగం వెంకట్రావ్​ ఇటీవలే ఢిల్లీలో బీజేపీలో చేరారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మరో మూడు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావుకు బీజేపీ ఎంపీ టికెట్ కన్ఫామ్​ అని ప్రచారం జరిగింది.  టికెట్ హామీతోనే ఆయన పార్టీలో చేరారని సన్నిహితులు, అనుచరులు చెబుతూ వచ్చారు. రెండు, మూడు సార్లు హైదరాబాద్ లోని బీజేపీ ఆఫీస్ కు వెళ్లి, టికెట్  కోసం ప్రయత్నించారు. కానీ అనూహ్య పరిస్థితుల్లో జలగం కు టికెట్ దక్కలేదు. దీంతో ఆయన రాజకీయ భవిష్యత్ ఏంటనేది సస్పెన్స్ గా మారింది. ఖమ్మం జిల్లాలోని అనుచరులకు ముందస్తుగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండానే బీజేపీలో జలగం జాయిన్ అయ్యారు. చివరకు టికెట్ రాకపోవడంతో ఆయన బీజేపీలో కంటిన్యూ కావడం కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.