- పాత, కొత్త నేతల బలాబలాలపై రెడీ అవుతున్న రిపోర్టు
- బలహీనంగా ఉన్న చోట కొత్తోళ్లను చేర్చుకోవడంపై దృష్టి
హైదరాబాద్, వెలుగు: ఎన్నికలు దగ్గరపడుతున్నందున అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బీజేపీ దృష్టి పెట్టింది. ప్రతి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఎట్లుంది.. అక్కడ పాత నేతలతో పాటు కొత్తగా చేరిన నాయకుల బలాలు, బలహీనతలపై రిపోర్టు రెడీ చేస్తున్నది. ఏ నియోజకవర్గంలో పార్టీకి సరైన అభ్యర్థులు లేరో.. అక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్లకు చెందిన బలమైన నేతలను పార్టీలోకి ఆహ్వానించే ప్రోగ్రామ్ను స్పీడప్ చేసింది. పార్టీ విజయావకాశాలపై రిపోర్టును రెడీ చేసే పనిలో సీనియర్ నేత ఆధ్వర్యంలో ఒక టీమ్ పనిచేస్తున్నది.
పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్లు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ సూచనలతో కసరత్తు జరుగుతుంది. అలాగే, హైకమాండ్ తరఫున రెండు టీమ్లు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సర్వే చేస్తుండగా, అమిత్ షా ప్రత్యేకంగా 60 మందితో టీమ్లు ఏర్పాటు చేసి పార్టీ పరిస్థితిపై రిపోర్టులు తెప్పించుకుంటున్నారు. త్వరలోనే అభ్యర్థులను ప్రకటించేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ రెడీ అవుతుండగా, బీజేపీ మాత్రం ఇప్పటికిప్పుడు అభ్యర్థులను ప్రకటించే చాన్స్ లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అభ్యర్థుల ప్రకటన విషయంలో ఆ పార్టీలతో పోటీ పడబోదని, మా వ్యూహాలు మాకు ఉన్నాయని.. బీజేపీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. వారు ముందుగా అభ్యర్థులను ప్రకటించినంత మాత్రాన బీజేపీ గెలుపు అవకాశాలను ఏ మాత్రం దెబ్బతీయలేవన్నారు.
