బీజేపీ యాక్షన్​ ప్లాన్​..60 రోజుల్లో 20 ప్రోగ్రామ్​లు

బీజేపీ యాక్షన్​ ప్లాన్​..60 రోజుల్లో 20 ప్రోగ్రామ్​లు
  • రాష్ట్ర పార్టీ కౌన్సిల్ మీటింగ్​లో తీర్మానం

హైదరాబాద్, వెలుగు : రాబోయే 60 రోజుల ప్రణాళికను బీజేపీ రెడీ చేసింది. 20 రకాల కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. శుక్రవారం జరిగిన బీజేపీ స్టేట్ కౌన్సిల్ మీటింగ్ ఈమేరకు తీర్మానం చేసింది. నిత్యం ప్రజల్లో ఉండేలా సభలు, సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ 60 రోజుల్లో మొత్తం 43 బహిరంగ సభలకు బీజేపీ ప్లాన్ చేసుకుంది. ప్రధాని మోడీతో రాష్ట్రంలో మరో మూడు సభలు నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నది. కేసీఆర్ సర్కారు వైఫల్యాలను గ్రామ స్థాయిలో ఎండగట్టాలని నిర్ణయించారు. ఈ నెల 8  న పసుపు బోర్డ్, ట్రైబల్ వర్సిటీ, కృష్ణ ట్రిబ్యునల్ ఏర్పాటుపై రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవాలు నిర్వహించాలని ప్లాన్ చేశారు.

ఈ నెల 9, 10, 11 తేదీల్లో ‘మేరా మాటి మేరీ దేశ్’లో భాగంగా అసెంబ్లీ కేంద్రాల వారీగా మట్టి సేకరణ చేపట్టనుంది. ఈ నెల 10 నుంచి 31 వరకు 38 జిల్లాలో పబ్లిక్ మీటింగ్స్ కు ప్లాన్ చేసుకుంది. 3 లక్షల మందిని గుర్తించి ప్రధాని విశ్వకర్మ యోజన కింద రూ.3 లక్షల లోన్ ఇప్పించాలని.. 15న బీజేపీ మేనిఫెస్టోపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని నిర్ణయించింది. ఈ నెల11న ట్రైబల్ ఏరియా లో గిరిజన యూనివర్శిటీ అమలుపై సంబరాలు జరపాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల13 నుంచి 20 వరకు అసెంబ్లీ స్థాయి సమావేశాలు, సోషల్ మీడియా టీంలతో సమావేశం కానున్నారు. ఈ నెల 26 నుంచి అన్ని మోర్చాలు ఇంటింటికి వెళ్లి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని స్టేట్ కౌన్సిల్ మీటింగ్ నిర్ణయించింది.