జులై 25న జరగనున్న బీజేపీ ధర్నా వాయిదా

జులై 25న జరగనున్న బీజేపీ ధర్నా వాయిదా

డబుల్ బెడ్ రూం ఇండ్ల సమస్యలపై ఇందిరా పార్క్ దగ్గర  జులై 25న జరగనున్న మహాధర్నాను వాయిదా వేసింది బీజేపీ. హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తుండడం, అవసరమైతే తప్ప పబ్లిక్ బయటకు రావొద్దని బల్దియా సూచించడంతో.. ముందు జాగ్రత్తగా ధర్నాను వాయిదా వేసుకుంది బీజేపీ.  

 ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వలేదంటూ ఇవాళ హైకోర్టును ఆశ్రయించారు బీజేపీ నేతలు. లంచ్ మోషన్ పిటిషన్ పై కోర్టు విచారణ చేపట్టింది. ధర్నాకు ఎందుకు పర్మీషన్ ఇవ్వడం లేదని పోలీసులను ప్రశ్నించింది కోర్టు. ఇతర పార్టీలకు పర్మీషన్ ఇచ్చి బీజేపీకి ఎందుకు ఇవ్వలేదని నిలదీసింది. సచివాలయ ముట్టడించే అవకాశం ఉన్నందున సభకు పర్మీషన్ ఇవ్వలేదని ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదించారు. ఇతర పార్టీలు ధర్నా చేస్తున్నప్పుడు లా అండర్ ఆర్డర్ సమస్య రాలేదా అని ప్రశ్నించింది కోర్టు. బీజేపీ ధర్నాకు దాదాపు 1000 మంది వచ్చే అవకాశం ఉందని న్యాయవాది చెప్పారు. వెయ్యి మందిని కంట్రోల్ చేయకపోతే అక్కడ పోలీసులు ఎందుకని ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇందిరాపార్క్ దగ్గర ధర్నాలు చేస్తే.. లా అండర్ ఆర్డర్ సమస్య రాలేదా అని అడిగింది. బీజేపీ ధర్నాకు పర్మీషన్ ఇవ్వాలని ఆదేశించింది.

మరోవైపు ఈనెల 29న జరిగే అమిత్ షా టూర్ లో మార్పులు చేర్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఖమ్మం బహిరంగ సభను రద్దు చేసుకుని.. అదే టైంలో హైదరాబాద్ లో పలు కార్యక్రమాల్లో పాల్గొనేలా షెడ్యూల్ మార్చారు. సిటీలో కొంతమంది మేధావులతో భేటీ కావాలని నిర్ణయించినట్లు సమాచారం.