నాలుగు స్థానాల్లో సిట్టింగ్​లకే బీజేపీ ఎంపీ టికెట్​లు!

నాలుగు స్థానాల్లో సిట్టింగ్​లకే బీజేపీ ఎంపీ టికెట్​లు!
  • నాలుగు స్థానాల్లో సిట్టింగ్​లకే బీజేపీ ఎంపీ టికెట్​లు!
  • చివరి దశకు అభ్యర్థుల ఎంపిక ప్రాసెస్
  • సిట్టింగ్​లతో పాటు మరో ఆరు సీట్లలో అభ్యర్థులపై క్లారిటీ
  • ఇక మిగిలిన ఏడు  సీట్లలో.. ఐదింటిపై కన్నేసిన బీఆర్ఎస్ నేతలు

హైదరాబాద్, వెలుగు: రాబోయే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే బీజేపీ అభ్యర్థుల జాబితాపై కసరత్తు చివరి దశకు చేరింది. వారంలోపే అభ్యర్థుల లిస్ట్​ను ఖరారు చేస్తామని, ఆ వెంటనే ప్రకటిస్తామని పార్టీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఊపందుకుంది. స్టేట్​లో మొత్తం 17 ఎంపీ సీట్లు ఉండగా.. అందులో నాలుగు సిట్టింగ్ సీట్లతో పాటు మరో ఆరు సీట్లలో పోటీకి బీజేపీ అభ్యర్థుల జాబితా రెడీ అయినట్లు సమాచారం. ఇందులో సికింద్రాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ సిట్టింగ్ సీట్లలో తిరిగి వారికే టికెట్ ఇవ్వనున్నట్లు తెలిసింది.

చేవెళ్ల, మల్కాజిగిరి, మెదక్, భువనగిరి, మహబూబ్ నగర్, హైదరాబాద్ సీట్లలో పార్టీ తరఫున ఎవరిని బరిలో నిలపాలనేదానిపైనా హైకమాండ్ కు స్పష్టత ఉన్నట్టు సమాచారం. ఇక మిగిలిన ఏడు సీట్లపైనే కసరత్తు సాగుతోంది. అందులో పెద్దపల్లి, నాగర్ కర్నూల్, వరంగల్ ఎస్సీ నియోజకవర్గాలతో పాటు, మరో ఎస్టీ నియోజకవర్గం అయిన మహబూబాబాద్ నుంచి పోటీకి బీఆర్ఎస్ కు చెందిన కొందరు సిట్టింగ్ లు, ఆ పార్టీ మాజీ ఎంపీలు, ముఖ్య నేతలు ఇప్పటికే బీజేపీ నేతలతో టచ్ లోకి వచ్చినట్టు చర్చ జరుగుతున్నది. టికెట్ ఇస్తే కారును వదిలి.. కమలం నీడన చేరేందుకు వారు రెడీగా ఉన్నట్టు సమాచారం. ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలకు టికెట్ ఇచ్చే విషయంలో బీజేపీ జాతీయ నాయకత్వం సైతం పూర్తి సానకూలంగా ఉంది. 

పార్టీలో ఎప్పటి నుంచి ఉంటున్నామన్న దానికన్నా.. గెలుపే ప్రాతిపదికగా ఇతర పార్టీల వారు బలమైన అభ్యర్థులు అనుకుంటే వారిని పార్టీలోకి ఆహ్వానించి టికెట్ ఇవ్వాలని ఇప్పటికే  బీజేపీ హైకమాండ్ రాష్ట్ర నేతలకు పలు సందర్భాల్లో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ లెక్కన ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్  నేతలకు బీజేపీ టికెట్లు ఇచ్చే అవకాశం ఉందని కమల దళంలో చర్చ జోరుగా సాగుతోంది. ఇక మిగిలిన నల్గొండ, ఖమ్మం లోక్ సభ సీట్ల విషయంలో మాత్రమే బీజేపీ హై కమాండ్ తర్జన భర్జన పడుతోందని పార్టీ వర్గాల్లో టాక్  నడుస్తోంది. ఇక్కడ బలమైన అభ్యర్థులు, ఇతర పార్టీల నేతల కోసం కమల దళం గాలిస్తోంది.