బీజేపీలో బుజ్జగింపులు .. అసంతృప్త నేతలతో హైకమాండ్ చర్చలు

బీజేపీలో బుజ్జగింపులు .. అసంతృప్త నేతలతో  హైకమాండ్ చర్చలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అసంతృప్త నేతలను బుజ్జగించేందుకు బీజేపీ హైకమాండ్ రంగంలోకి దిగింది. లోక్ సభ ఎన్నికల స్టేట్ ఇన్​చార్జ్ అభయ్ పాటిల్​కు అసంతృప్త నేతలను బుజ్జగించే బాధ్యతను అప్పజెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా 17 లోక్ సభ సెగ్మెంట్లు ఉండగా.. మూడు, నాలుగు స్థానాలు మినహా మిగతా అన్నింటిలోనూ బీజేపీ నేతల మధ్య సమన్వయ లోపం కనిపిస్తున్నది. పార్టీలో కొత్తగా చేరిన వారికి టికెట్లు ఇవ్వడాన్ని పాత నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్, మల్కాజిగిరి, జహీరాబాద్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ సెగ్మెంట్లలోని నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మల్కాజిగిరి టికెట్ రాకపోవడంతో జాతీయ నేత మురళీధర్ రావు అసంతృప్తిలో ఉన్నారు. ఆ టికెట్ ఆశించిన మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ఆ పదవికి రాజీనామా చేశారు.

మహబూబ్ నగర్ టికెట్ దక్కలేదని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. అక్కడ టికెట్ ఆశించిన రాష్ట్ర నేత శాంతికుమార్ అసంతృప్తితో ఉన్నారు. ఖమ్మం టికెట్ కోసమే జలగం వెంకట్రావు బీజేపీలో చేరగా, ఆయనను కాదని తాండ్ర వినోద్ రావుకు హైకమాండ్ టికెట్ ఇచ్చింది. దీంతో జలగం వర్గం ఆగ్రహంతో ఉంది. ఇక నల్గొండలో సైదిరెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని అక్కడి నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో లోక్ సభ ఎన్నికల స్టేట్ ఇన్​చార్జ్  అభయ్ పాటిల్ శనివారం పార్టీలోని అన్ని విభాగాలతో సమావేశమయ్యారు. ఎక్కడెక్కడ అసంతృప్తులు ఉన్నారనే వివరాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలో కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటికి వెళ్లి, ఆయనతో చర్చించారు. అలాగే టికెట్లు ఆశించి రానోళ్లు, ఇతర కారణాలతో ప్రచారానికి దూరంగా ఉన్న నేతలతో గత రెండ్రోజులుగా ఫోన్ లో ఆయన మాట్లాడారు. విభేదాలు పక్కనపెట్టి అందరూ కలిసి పని చేయాలని సూచించారు.  

రాజాసింగ్ ఇంటికి అభయ్ పాటిల్..  

ఎమ్మెల్యే రాజాసింగ్ తోఅభయ్ పాటిల్ సమావేశమయ్యారు. ఆదివారం బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి తో కలిసి ఆయన ఇంటికి వెళ్లారు. బీజేపీ ఎల్పీ లీడర్ పదవి ఇవ్వకపోవడం, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి ఎంపికలో తన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదని రాజాసింగ్ అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో ఆయనను అభయ్ పాటిల్ కలిసి దాదాపు 45 నిమిషాల పాటు చర్చించారు.

అనంతరం అభయ్ మీడియాతో మాట్లాడుతూ.. రాజాసింగ్ కొన్ని అంశాలు తమ దృష్టికి తీసుకొచ్చారని, వాటిని పరిష్కరిస్తామని చెప్పారు. ఆయన సేవలను ఉపయోగించుకుంటామన్నారు. ఈసారి 12 సీట్లలో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నేతలెవరూ అసంతృప్తిలో లేరని, చిన్న చిన్న సమస్యలుంటే పరిష్కరించుకుంటామని తెలిపారు. మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల ప్రచారంపై రాజాసింగ్ తో చర్చించామని చెప్పారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో రాజాసింగ్ పాల్గొంటున్నారని, అందుకే ఆయన ఇన్ని రోజులు అందుబాటులో లేరని తెలిపారు.