రాజ్యసభకు ఎవరిని పంపుదాం..అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు

రాజ్యసభకు ఎవరిని పంపుదాం..అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు
  • ప్రధాని మోదీ నేతృత్వంలో సీఈసీ భేటీ
  • హాజరైన రాజనాథ్, షా, సంతోష్, లక్ష్మణ్, కీలక నేతలు

న్యూఢిల్లీ, వెలుగు: త్వరలో జరిగే రాజ్య సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపికపై బీజేపి కసరత్తు చేసింది. ఆదివారం సాయంత్రం ‘పీఎం సేవా తీర్థ్’ (ప్రధాని నివాసంలో)లో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) భేటీ జరిగింది. ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో సీఈసీ సభ్యులు రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, సంతోష్, జేపీ నడ్డా, డా. లక్ష్మణ్, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. దాదాపు మూడు గంటలకు పైగా సాగిన ఈ భేటీలో పలు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలిసింది.

ఈ రోజు ఆయా స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల మొదటి దఫా జాబితా విడుదల చేయనున్నట్లు సమాచారం. కాగా జూన్ 21 నుంచి జూలై 19 మధ్య 10 రాష్ట్రాల్లోని 24 రాజ్య సభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఇందులో ఏపీ, గుజరాత్, కర్నాటకల రాష్ట్రాల్లో నాలుగేసి స్థానాలు, మధ్య ప్రదేశ్, రాజస్తాన్​లో మూడేసి స్థానాలు, జార్ఖండ్​లో రెండు, మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరంలో ఒక్కో స్థానం ఖాళీ కానుంది. ఆయా స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) ఇటీవల ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నామినేషన్ల దాఖలుకు జూన్ 8 చివరి తేదీగా ప్రకటించింది.  

నేడు బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీ

మరోవైపు పార్టీ చీఫ్ నితిన్ నబీన్ అధ్యక్షతన సోమవారం బీజేపీ జాతీయ కార్యవర్గం భేటీ కానుంది. ఇందులో పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ(ఆర్గనైజేషన్), నేషనల్ జనరల్ సెక్రటరీలు, జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్లు, స్టేట్ ప్రెసిడెంట్లు హాజరుకానున్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్ 12 ఏండ్లు పూర్తి చేస్తుకున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా చేపట్టే కార్యకమాలపై ఇందులో చర్చించనున్నారు. నితిన్ నబీన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నాలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను ప్రకటించినప్పటికీ పూర్తి స్థాయి కొత్త కార్యవర్గాన్ని ప్రకటించలేదు. త్వరలోనే కొత్త కార్యవర్గాన్ని ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.