దండేపల్లి, వెలుగు: యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. సోమవారం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల ముత్యంపేటలో రైతులతో కలిసి రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం 20 రోజుల క్రితం మండల వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి చేతులు దులుపుకుందని ఎద్దేవా చేశారు. రైతులు వడ్లు, మక్కలను రోడ్లపై కుప్పలుగా పోసి కొనుగోలుకు ఎదురు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాస్తారోకోతో వాహనాలు నిలిచిపోవడంతో ఎస్సై తహసీనోద్దిన్ తహసీల్దార్ రోహిత్ దేశ్ పాండేతో కలిసి అక్కడికి చేరుకొని నేతలతో మాట్లాడారు. రెండు రోజుల్లో ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఆందోళనలో బీజేపీ ప్రధాన కార్యదర్శి పత్తిపాక సంతోష్, నేతలు ఎం.అనిల్, బి.వెంకటేశ్, బి.సురేశ్, కె.కిషన్, వి.శ్రీనివాస్, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

