
- లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్: తరుణ్‌చుగ్
- జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసును సీబీఐకి అప్పగించాలి
- దారుణాలు జరుగుతున్నా సీఎం స్పందించకపోవడం ఏమిటి?
- ఆడబిడ్డల తల్లిదండ్రులు భయాందోళనలకు గురవుతున్నారు
- చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే భక్షకులుగా మారిపోయారని ఫైర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయిందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. అఘాయిత్యాలను నిరోధించడంలో, శాంతి భద్రతలను కాపాడటంలో, పరిపాలనా నిర్వహణలో...ఇలా అన్నింట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారు” అని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ మైనర్ అత్యాచార కేసులో నిందితులను తప్పించేందుకు రాష్ట్ర సర్కార్ కుట్రచేస్తున్నదని ఆయన ఆరోపించారు. నిందితులకు పోలీసులే కొమ్ముకాస్తున్నారని, ఈ కేసును వెంటనే సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో జంగల్ రాజ్ నడుస్తున్నది. ఇక్కడ ప్రజాస్వామ్యానికి, న్యాయవ్యవస్థకు స్థానం లేకుండాపోయింది. తెలంగాణ బిడ్డలు సురక్షితంగా లేరు.. శాంతి భద్రతలు గాలిలో కలిశాయి” అని అన్నారు.
గ్యాంగ్ రేప్ ఘటనలో బీజేపీ ఆందోళన మొదలుపెట్టిన తర్వాతే పోలీసుల్లో కదలిక వచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో నేరాలు జరుగుతున్నా సీఎం కేసీఆర్ స్పందించకపోవడం ఏంటని తరుణ్ చుగ్ ప్రశ్నించారు. ఆడబిడ్డలు ఉన్న తల్లిదండ్రులు భయాందోళనలకు గురవుతున్నారని అన్నారు. ‘‘రాష్ట్రంలో అసమర్థ ప్రభుత్వం నడుస్తున్నది. కేసీఆర్ పూర్తిగా కుటుంబ రాజకీయాల్లో మునిగిపోయారు. రాష్ట్రంలో చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే భక్షకులుగా మారడం బాధాకరం. పోలీసులు లా అండ్ ఆర్డర్ పై కన్నా ఎక్కువగా కేసీఆర్ ఇంటి చుట్టూ తిరగడానికే సరిపోతున్నది. జూబ్లీహిల్స్ ఘటనలో పోలీసుల తీరుపై అనుమానాలు ఉన్నందున, బాధితురాలికి న్యాయం జరగాలంటే ఈ కేసును సీబీఐకి అప్పగించాలి” అని తరుణ్‌చుగ్ డిమాండ్ చేశారు. సీబీఐకి అప్పగిస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. కేసీఆర్ సెక్రటేరియట్‌కు వెళ్లకుండా ఫాంహౌస్‌కే పరిమితమయ్యారని, ఆయన కొడుకు కేటీఆర్ ట్విట్టర్లో బిజీగా ఉన్నారని, ఇక హోం మంత్రి అసలు ఉన్నారా? లేరా అనేది తెలియని పరిస్థితని మండిపడ్డారు. ‘‘కేసీఆర్ తన పర్సనాలిటీని దేశవ్యాప్తంగా బిల్డప్ చేసుకోవడానికి సర్కారు ఖజానా నుంచి రూ.109 కోట్లు ఖర్చు చేసి దేశంలోని అన్ని పత్రికలకు ప్రకటనలిచ్చారు. పేదల సొమ్మును వ్యక్తిగత ఇమేజీ కోసం దుర్వినియోగం చేసే హక్కు కేసీఆర్‌కు ఎవరిచ్చారు?” అని తరుణ్ చుగ్ ప్రశ్నించారు.
ఆధారాలన్నీ గల్లంతు చేశారు: సంజయ్
గ్యాంగ్ రేప్ కేసుకు సంబంధించిన ఆధారాలన్నీ గల్లంతు చేశాకే ఎమ్మెల్యే కొడుకుపై కేసు పెట్టారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ‘‘పోలీసులు ఎమ్మెల్యే వాహనాన్ని సర్వీసింగ్ చేసి ఆధారాలన్నీ గల్లంతయ్యాయని నిర్ధారణ చేసుకున్నాకే ఆ ఎమ్మెల్యే కొడుకుపై కేసు పెట్టి నిందితుల జాబితాలో చివరన చేర్చారు. బీజేపీ ఉద్యమించడంవల్లే పోలీసులు ఈ మాత్రమైనా స్పందించారు. లేకపోతే కేసును మూసివేసేవారు” అని అన్నారు. సీఎం కేసీఆర్ చేతగానితనం వల్లే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని ధ్వజమెత్తారు. గ్యాంగ్ రేప్ కేసులో మెజిస్ట్రేట్ ఎదుట బాలిక స్టేట్ మెంట్ రికార్డు చేయాల్సినప్పటికీ సకాలంలో చేయలేదని పేర్కొన్నారు. ‘‘‘ఎంఐఎం నాయకులు అత్యాచారాలు చేస్తుంటే.. టీఆర్ఎస్ నాయకులు హత్యలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా... ఏ సంఘటన జరిగినా వెంటనే స్పందిస్తామని... సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు పసిగడతాయని చెప్పిన కేసీఆర్ కొడుకు కేటీఆర్ ఇప్పుడేమంటారు? రాష్ట్రంలో అత్యాచారాలు చేస్తే కండ్లు పీకేస్తామన్న కేసీఆర్ ఏమైండు” అని ఆయన ప్రశ్నించారు. పథకం ప్రకారమే బాలికపై అత్యాచారం జరిగిందని, ఈ కేసును వెంటనే సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.
బీజేపీ సమావేశాల ఏర్పాట్లపై తరుణ్ చుగ్, శివ ప్రకాశ్ సమీక్ష
వచ్చే నెల 2, 3 తేదీల్లో హైదరాబాద్‌లో జరుగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ఏర్పాట్లపై పార్టీ రాష్ట్ర నేతలతో తరుణ్ చుగ్, సంస్థాగత సహ ప్రధాన కార్యదర్శి శివ ప్రకాశ్ బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో సమీక్షించారు. ఇందులో సంజయ్, లక్ష్మణ్, రఘునందన్ రావు, ఇంద్రసేనా రెడ్డి, రామచంద్రారెడ్డి, రాంచంద్రారావు, మంత్రి శ్రీనివాస్, ప్రదీప్ రావు, ప్రేమేందర్ రెడ్డి, మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సంబంధించి రాష్ట్ర శాఖ ఏర్పాటు చేసిన మొత్తం 38 కమిటీల్లో బుధవారం కొన్ని కమిటీలతో నేతలు భేటీ కాగా.. గురువారం మరికొన్ని కమిటీలతో హెచ్ఐసీసీలోని నోవాటెల్‌లో భేటీ అవుతారు. సమావేశాల ఏర్పాట్లను సమీక్షించేందుకు కొత్తగా ఐదుగురితో స్టీరింగ్ కమిటీని పార్టీ రాష్ట్ర శాఖ ఏర్పాటు చేసింది. ఇందులో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్, పార్టీ నేతలు చింతల రాంచందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఉన్నారు. ఈ కమిటీ గురువారం సమావేశం కానుంది.