రాష్ట్రంలో బీజేపీనే ప్రత్యామ్నాయం: రాజగోపాల్ రెడ్డి

రాష్ట్రంలో బీజేపీనే ప్రత్యామ్నాయం: రాజగోపాల్ రెడ్డి

నల్గొండ, వెలుగురాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ పరిస్థితి ఘోరంగా తయారైందని, ఇరవయ్యేండ్లయినా అది అధికారంలోకి రాలేదని, టీఆర్​ఎస్​ పార్టీకి బీజేపీనే ప్రత్యామ్నాయంగా కనిపిస్తోందని మునుగోడు కాంగ్రెస్​ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్​ పార్టీ తప్పుడు నిర్ణయాల వల్లే 12 మంది ఎమ్మెల్యేలు చేజారిపోయారని, కనీసం అసెంబ్లీ ఎన్నికలైన తర్వాత లీడర్​ షిప్​ను చేంజ్​ చేసి ఉంటే బాగుండేదని ఆయన అన్నారు. శనివారం ఆయన నల్గొండలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో టీఆర్​ఎస్​ పార్టీకి  బీజేపీనే ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నది. కేసీఆర్​ను దెబ్బతీయాలన్నా, కేసీఆర్​ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్నా అది బీజేపీతోనే సాధ్యమని ప్రజల్లో చర్చ నడుస్తున్నది. తెలంగాణలో బీజేపీకి అనుకూల పరిస్థితి ఉంది. దేశంలో కూడా రాబోయే పదేళ్లు బీజేపీనే వచ్చేలా ఉంది. కాంగ్రెస్​ పార్టీకి జాతీయ స్థాయిలో కూడా బలమైన నాయకత్వం లేదు. రాష్ట్రంలో అయితే కాంగ్రెస్​లో ఎవరి స్వార్థం వారిదే”అని అన్నారు. హైకమాండ్​ సరైన నిర్ణయాలు తీసుకొని ఉంటే పార్టీకి ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని పేర్కొన్నారు. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు రాహుల్​గాంధీ తన పదవికి రాజీనామా చేస్తామంటున్నారని, దానితో లాభం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

ఉత్తమ్​కు లీడర్​షిప్​ క్వాలిటీస్​ లేవు

పీసీసీ చీఫ్​ ఉత్తమ్​కుమార్​రెడ్డికి లీడర్​షిప్​ క్వాలిటీస్​ లేవని రాజగోపాల్​రెడ్డి విమర్శించారు. ‘‘ఉత్తమ్​కుమార్​రెడ్డి అధికారంలోకి వచ్చే దాకా గడ్డం తీయనన్నరు. అదే గడ్డంతో మళ్లీ ఎంపీగా పోటీ చేసిండ్రు. మాటంటే కట్టుబడి ఉండాలి. ఆయన మాట నిలుపుకోలేదు. ఉత్తమ్​కుమార్​రెడ్డి వ్యక్తిగతంగా మంచి వ్యక్తే కానీ.. ఆయనకు లీడర్​షిప్​ క్వాలిటీస్​ లేవు. అందరినీ కలుపుకోలేకపోతున్నారు. ఆయన ప్రజల్లోకి పోలేదు. జగన్​లాగా పాదయాత్ర చేయలేదు. కేసీఆర్​ను ఎండగట్టాలంటే ప్రజలతో కలిసి మమేకమై పాదయాత్ర చేయాల్సింది. ఎంతసేపు గాంధీభవన్​లో కూర్చొని ప్రెస్​మీట్లు పెట్టడం.. డిపాజిట్​ రాని క్యాండిడేట్లను చుట్టుపెట్టుకోవడమే ఆయన పని” అని దుయ్యబట్టారు. రాష్ట్ర కాంగ్రెస్​ నాయకులను సమన్వయం చేసే కెపాసిటీ కాంగ్రెస్​ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి కుంతియాకు లేదన్నారు. క్యాంపెయిన్​ కమిటీ చైర్మన్​గా ఫెయిలైన భట్టి విక్రమార్కకు సీఎల్పీ నేతగా ఎంపిక చేశారని, ఆ ఎంపిక విషయంలో పార్టీలోని అందరితో చర్చించలేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్​ సీనియర్​ నాయకులే టీఆర్​ఎస్​తో మ్యాచ్​ ఫిక్సింగ్​ చేసుకుంటున్నారని, నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇదే జరిగిందన్నారు. ఓటుకు నోటుకు కేసులో జైలుకుపోయొచ్చిన రేవంత్​రెడ్డికి పీసీసీ చీఫ్​ పదవి ఇస్తే పార్టీ పరిస్థితి ఇంకా ఘోరంగా తయారవుతుందని, రేవంత్​రెడ్డి చంద్రబాబు మనిషి అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్​కు భవిష్యత్తు లేదని, కార్యకర్తలతో చర్చించి తన భవిష్యత్తు నిర్ణయాన్ని తీసుకుంటానని చెప్పారు. కేసీఆర్​పై పోరాటమే తన ఏకైక లక్ష్యమని, దాన్ని బలపర్చే వైపే తన నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు.

రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలు వాస్తవమే: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్‌, వెలుగు: కాంగ్రెస్​ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి నాయకులు అనేక మంది బీజేపీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అందరినీ ఆహ్వానించి పార్టీని మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. శనివారం  హైదరాబాద్​లో ఆయన పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి వ్యాఖ్యలను మీడియా ప్రస్తావించగా.. ‘‘ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్నే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి చెప్పారు. ప్రజలంతా బీజేపీ వైపే చూస్తున్నారు” అని కిషన్​రెడ్డి అన్నారు. బీజేపీలో చేరేందుకు యువత ఉత్సాహం చూపిస్తోందని, పార్టీ ని బలోపేతం చేసేందుకు పదిలక్షల మంది యువతను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఇండియాను అస్థిరపర్చాలని పాకిస్థాన్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. దేశ ప్రజలకు సరిగా తిండి పెట్టలేని పాక్ ప్రభుత్వం భారత దేశాన్ని ఏదో చేస్తామని భ్రమపడుతోందని ఆయన ఎద్దేవా చేశారు. అవసరమైతే పాకిస్థాన్ కు మరోసారి బుద్ధి చెప్పేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. తనను సికింద్రాబాద్‌ ఎంపీగా ఎన్నుకున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానన్నారు.