23న చేవెళ్లలో అమిత్ షా సభ.. కార్యకర్తల్లో ఊపు

23న చేవెళ్లలో అమిత్ షా సభ.. కార్యకర్తల్లో ఊపు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడ్తుండటంతో అధికారమే లక్ష్యంగా పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేయాలని బీజేపీ రాష్ట్ర శాఖ నిర్ణయించింది. పార్లమెంట్ నియోజకవర్గాల స్థాయిలో ప్రోగ్రామ్ లను మరింత స్పీడప్ చేసేందుకు కమల దళం సిద్ధమైంది. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో జరిగిన పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్, కో కన్వీనర్, ఇంచార్జీ, విస్తారక్ ల సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ సునీల్ బన్సల్ ఈ మేరకు రెండు నెలల కార్యాచరణను ప్రకటించారు.

రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా క్యాడర్​ను హైకమాండ్ సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా బూత్ స్థాయిలో స్వశక్తీకరణ్ అభియాన్, పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమాల అమలుపై నేతలతో సునీల్ బన్సల్ చర్చించారు. అన్ని లోక్ సభ నియోజకవర్గ కేంద్రాల్లో పార్లమెంట్ ప్రవాస్ యోజన కింద భారీ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో మొదటి సభను ఈ నెల 23న చేవెళ్ళలో జరిపేందుకు పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. చీఫ్ గెస్టుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు.

ఇప్పటికే సభ ఏర్పాట్లపై పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా నేతలు చేవెళ్లలో సభా స్థలాన్ని పరిశీలించి లోకల్ క్యాడర్ కు పలు సూచనలు చేశారు. మిగతా 16 నియోజకవర్గ కేంద్రాల్లోనూ ఇలాంటి సభలే నిర్వహించనున్నారు. కొన్నింటికి అమిత్ షా, మరికొన్నింటికి పార్టీ చీఫ్ నడ్డా అటెండ్ కానున్నారు.  రెండు నెలల పాటు విస్తృతంగా సాగనున్న పార్లమెంట్ ప్రవాస్ యోజన ప్రోగ్రామ్ లో గతంలో నిర్ణయించిన విధంగానే కేంద్ర మంత్రులు పర్యటించనున్నారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలు, అమలును పర్యవేక్షించి లబ్ధిదారులతో మాట్లాడనున్నారు. కేంద్ర పథకాలను గడప, గడపకు తీసుకెళ్లాలని, బీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలు, కుటుంబ, అవినీతి, నియంత పాలనను జనంలో ఎండగట్టాలని ఈ సందర్భంగా క్యాడర్ కు సునీల్ బన్సల్ పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ సీనియర్ నేతలు చింతల రాంచంద్రా రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, కాచం వెంకటేశ్వర్లు, ఇతర నేతలు పాల్గొన్నారు.

ఉమ్మడి జిల్లాలకు విభాగ్​ల నియామకం

రాష్ట్రవ్యాప్తంగా బూత్ స్వశక్తీకరణ్ అభియాన్, పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమాల అమలు తీరును పరిశీలించడంతో పాటు సంస్థాగత బలోపేతం కోసం పది ఉమ్మడి జిల్లాలకు విభాగ్(ఇన్​చార్జీ)లను ఈ సమావేశంలో ప్రకటించారు. ఇందులో వరంగల్​కు వివేక్ వెంకటస్వామి, హైదరాబార్​కు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మెదక్​కు జితేందర్ రెడ్డి, నిజామాబాద్​కు బూర నర్సయ్య గౌడ్, కరీంనగర్​కు చాడ సురేశ్ రెడ్డి, ఖమ్మంకు గరికపాటి మోహన్ రావు, ఆదిలాబాద్​కు మర్రి శశిధర్ రెడ్డి, నల్గొండకు బంగారు శృతి, రంగారెడ్డికి ప్రేమేందర్ రెడ్డి, మహబూబ్​నగర్​కు దుగ్యాల ప్రదీప్ కుమార్​ను నియమించారు.