
- ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ బీజేపీనే
- రాహుల్ విదేశాల్లో సేద తీరుతున్నారు
- ఓటమి నుంచి దృష్టి మరల్చేందుకే కేసీఆర్ కాళేశ్వరం ప్రారంభిస్తున్నారు
- రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్
ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా బీజేపీ అవతరించిందని రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. ఈ రోజు ఆయన సమక్షంలో మహబూబాబాద్ జిల్లాకు చెందిన పలు పార్టీల నేతలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. దేశంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వం 11 కోట్లకు చేరుకుందని, ప్రస్తుతం రాష్ట్రంలో కూడా బీజేపీకి 15 లక్షల సభ్యత్వం ఉందని అన్నారు. ఈ నెల 6 వ తేది నుండి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగిందని, ఈ సారి రాష్ట్రంలోకనీసం 20% సభ్యత్వాన్ని అదనంగా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. కనీసం 5 లక్షల మందిని పార్టీలో చేర్పిస్తామని లక్ష్మణ్ అన్నారు.
ఈ రాష్ట్రంలో మేమే ప్రత్యామ్నాయమని కాంగ్రెస్ చెబుతోంది కానీ.. ప్రస్తుతం కాంగ్రెస్ సరుకు హోల్ సేల్ గా అమ్ముడు పోయిందని లక్ష్మణ్ అన్నారు. కుళ్ళిపోయిన ఆ పార్టీకి చికిత్స చేసే అవకాశం కూడా లేదన్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ విదేశాల్లో సేద తీరేందుకు వెళ్లారన్నారు.
లోక్ సభ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న కేసీఆర్.. ఓటమి నుండి ప్రజల దృష్టి మరల్చేందుకే.. కాళేశ్వరం ప్రాజెక్టుపై పడ్డారన్నారు. 15% పనులు కూడా పూర్తి కాని కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రారంభోత్సవమనడం ఆశ్చర్యంగా ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని లక్ష్మణ్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించమని…: దత్తాత్రేయ
నీతి ఆయోగ్ సమావేశానికి తెలంగాణ ముఖ్య మంత్రి కేసీర్ హాజరు కాకపోవడం చాలా విచారకరమని ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఎందుకు గైర్హాజరయ్యారో తెలంగాణ ప్రజలకు కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించేలా కేసీఆర్ ప్రధాన మంత్రిని కోరివుంటే తెలంగాణ ప్రజల యొక్క అభిమానాన్ని ఇంకా ఎక్కువ చూరగొనేవాడన్నారు.ఈ నెల 19 వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించనున్న అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశానికైనా కేసీఆర్ హాజరవుతారని ఆశిస్తున్నానని దత్తాత్రేయ అన్నారు