
1695–1710 మధ్య కాలంలో ఖిలాషాపూర్ (వరంగల్) కేంద్రంగా మొఘల్ వైస్రాయిల క్రూర పాలన నుంచి తెలంగాణ ప్రజలను రక్షించే ప్రయత్నం చేసిన వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న. ఈయన జన్మస్థలం వరంగల్ జిల్లాలోని తారికొండ పక్కన ఉన్న లింగంపల్లి గ్రామం. రాచరిక వ్యవస్థ నీడలో జమీందార్లు, జాగీర్దార్లు సాగిస్తున్న అరాచకాలను ప్రత్యక్షంగా చూసిన పాపన్నకు చిన్నతనంలోనే తిరుగుబాటు ధోరణి అలవాటైంది.
అగ్రకుల భూస్వాములు, వ్యాపారుల గడీలు, కోటలపై దాడి చేసి దోచుకున్న సంపదను పేదలకు పంచాడు. ముస్లిం పాలకుల నిరంకుశత్వాన్ని ధిక్కరించాడు. సర్వాయి పాపన్న చర్యలను రాబిన్ హుడ్ తరహా తిరుగుబాటుగా చరిత్రకారులు బార్బరా, థామస్ మెట్కాల్ఫ్అభివర్ణించారు. మరో చరిత్రకారుడు రిచర్డ్ ఈటన్ సర్వాయి పాపన్నను సోషల్ బాండిట్గా పేర్కొన్నాడు.
తారికొండలో మొదటి కోట నిర్మాణం
సర్వాయి పాపన్న కల్లు గీత(గౌడ) కులానికి చెందినవారు. పాపన్న తండ్రి వృత్తిని చేపట్టడానికి నిరాకరించి, నాటి అరాచక పరిస్థితులను ఆసరాగా తీసుకుని రాజకీయ ప్రాముఖ్యం సాధించడానికి ప్రయత్నించాడు. తెలుగు జానపద సాహిత్యంలో పేర్కొన్నట్లు పాపన్న తన తల్లిని ఉద్దేశించి ‘తాటి చెట్లకు కల్లు కుండలు కట్టడం, దించడం, వాటిలో వాటా పొందడం నాకు రుచించవు. నా హస్తం గోల్కొండ కోట గోడపై పడాలి’ అన్నాడు. దీనిని బట్టి సర్వాయి పాపన్నకు చిన్నతనం నుంచే రాజ్యాధికార కాంక్ష ఉందని తెలుస్తున్నది.
ఔరంగజేబ్ సమకాలికుడైన ఖాఫీఖాన్ రచించిన ముంతకాబ్–ఉల్–లుబబ్ గ్రంథం సర్వాయి పాపన్న గురించి, తెలంగాణలో మొఘలుల పాలన గురించి విలువైన సమాచారాన్ని ఇస్తుంది. మొదట తన సోదరి ఇంటిని దోచుకుని, ఆ ధనంతో తారికొండలో ఒక చిన్న కోటను కట్టించాడు. సర్వాయి పాపన్న 1200 మందితో సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈయన సైనిక అధికారి మీరా సాహెబ్. పాపన్న తిరుగుబాటుకు చాకలి సర్వన్న, హసన్, ఇమామ్, దూదేకుల పీరు, కుమ్మరి గోవిందన్న, మంగలి మాసన్న, వెంకన్న, చిట్టెల, హుస్సేన్, పెరుమల్లు, పాసెల్ సహాయం చేశారు.
పాపన్న తిరుగుబాటు
మొఘల్ చక్రవర్తికి అండగా నిలిచిన ఫౌజ్దార్లను, జమీందార్లను పాపన్న ఎదురించాడు. ఈ క్రమంలోనే తన అనుచరులతో కలిసి కౌలాస్ దుర్గానికి పారిపోయాడు. అక్కడ స్థానిక జమీందారైన వెంకటరావు వద్ద తన అనుచరులతో కలిసి కొంతకాలం సైన్యంలో పనిచేశాడు. క్రీ.శ. 1701వ సంవత్సరంలో జమీందార్ వెంకటరావు మొఘల్ చక్రవర్తికి సామంతునిగా మారి మొఘల్ సైన్యంలో మన్సబ్ దార్ హోదాను పొందాడు. దీంతో సర్దార్ పాపన్న మళ్లీ తన స్వస్థలానికి వచ్చాడు.
ఆ తర్వాత షాపూర్లో కోటను నిర్మించాడు. ఇలాంటి పరిస్థితుల్లో సర్వాయి పాపన్నను అణచివేయడానికి ఔరంగజేబ్ కొలనుపాక ఫౌజ్దార్ అయిన ఖాసీంఖాన్‌ను నియమించగా, పాపన్న సైన్యాలకు, ఖాసీంఖాన్ సైన్యాలకు కొలనుపాకలో జరిగిన పోరాటంలో ఖాసీంఖాన్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ విధంగా తెలంగాణలో పాపన్న మొఘల్ సార్వభౌమాధికారానికి పెద్ద సవాలుగా మారాడు. 1702వ సంవత్సరంలో హైదరాబాద్ సుభా డిప్యూటీ గవర్నర్ రుస్తుందిల్ ఖాన్ భారీ సైన్యంతో పాపన్న స్థావరంపై దాడి చేశాడు. కానీ పాపన్న తప్పించుకున్నాడు. 1707లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ మృతిచెందడంతో సింహాసనం కోసం ఢిల్లీలో అతని వారసుల మధ్య పోరు మొదలై దక్కన్ ప్రాంత రాజకీయాలపై కొంత అలక్ష్యం చేశారు.
ఆ సమయంలోనే సర్వాయి పాపన్న యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండ మండలంలో ఉన్న వేములకొండ మీద కోట కట్టాడు. అలాగే, వరంగల్ జిల్లాలోని తాటికొండలో మరో కోట కట్టాడు. మరింత సైనిక బలాన్ని పెంచుకున్నాడు. 1708, ఏప్రిల్ 1న వరంగల్ పట్టణంలోని హిందూ ముస్లింలు మొహర్రం పండుగ ఏర్పాట్లలో నిమగ్నమై ఉండగా పాపన్న తన బలగంతో వరంగల్ కోటపై దాడి చేసి ఆక్రమించాడు. ఆ తర్వాత భువనగిరి, గోల్కొండ కోటలపై దాడి చేసి ఆక్రమించాడు.
తెలంగాణలో మొఘలుల పాలన
1687లో ఔరంగజేబ్ గోల్కొండ కోటపై దాడి చేసి కుతుబ్‌షాహీల పాలనను అంతమొందించి గోల్కొండ రాజ్యాన్ని మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేశాడు. అలాగే దక్కన్లో ఆరు సుభాలు ఏర్పాటు చేశాడు. అవి.. హైదరాబాద్, ఔరంగాబాద్, బీరార్, ఖాందేష్, బీదర్, బీజాపూర్. హైదరాబాద్ సుభాను బాల్ఘాట్ అని, పైన్ఘాట్ అని వ్యవహరించేవారు. ఔరంగజేబ్ ఈ ప్రాంతానికి రాహుల్లాఖాన్ను తాత్కాలిక రాజప్రతినిధిగా నియమించాడు.
రాహుల్లాఖాన్ తర్వాత ఖాన్ సిఫర్ఖాన్ సుబేదార్ అయ్యాడు. రెవెన్యూ పరిపాలనలో సిఫిర్ఖాన్కు సహాయం చేయడానికి ఔరంగజేబ్ మహ్మద్ షా అనే దివాన్ ను నియమించాడు. ఈయన హైదరాబాద్ లోని ఇజారా వ్యవస్థను తొలగించాడు. సిఫర్ఖాన్ భవిష్యత్తులో హైదరాబాద్‌ను బలోపేతం చేయాలన్న లక్ష్యంతో కొన్ని సంస్కరణలు చేశాడు. అందులో భాగంగా హైదరాబాద్ రాజ్యంలోని ముఖ్య దుర్గాలైన కౌలాస్, ఎలగందల్, కోయిలోకొండ, వరంగల్, పానగల్ మొదలైన వాటికి మరమ్మతులు చేయించాడు.
పాపన్న మరణం
1709లో మొఘల్ చక్రవర్తి మొదటి బహదూర్ షా ప్రజా దర్బార్‌ను నిర్వహించాడు. ఈ దర్బార్‌కు అనేక మంది జమీందార్లతోపాటు సర్వాయి పాపన్నను కూడా ఆహ్వానించాడు. సర్వాయి పాపన్నను మొఘల్ చక్రవర్తి ఒక రాజుగా గౌరవించి రోబ్ ఆఫ్ హానర్‌ను బహూకరించాడు. ప్రతిగా పాపన్న మొఘల్ చక్రవర్తికి పెద్ద మొత్తంలో నగదు అందజేశాడు. సర్వాయి పాపన్నను మొఘల్ చక్రవర్తి సత్కరించడం ఇష్టం లేని కొంత మంది ఉన్నతాధికారులు పాపన్నపై చక్రవర్తికి ఫిర్యాదు చేశారు. దాంతో మొఘల్ చక్రవర్తి పాపన్నను శిక్షించాల్సిందిగా హైదరాబాద్ కొత్త గవర్నర్ యూసుఫ్ఖాన్ను ఆదేశించాడు.
చరిత్రకారుడు కాఫీఖాన్ ప్రకారం సర్వాయి పాపన్నను శిక్షించే బాధ్యతను యూసుఫ్ ఖాన్ తన సేనాధిపతి అయిన దిలావర్ ఖాన్‌కు అప్పగించాడు. 1710లో దిలావర్ ఖాణ్తో విరోచితంగా పోరాడిన సర్వాయి పాపన్న చివరికి ప్రాణాలు కోల్పోయాడు. తెలంగాణలో మహ్మదీయ పాలకుల నిరంకుశత్వాన్ని ఎదురించిన తెలంగాణ తొలి విప్లవ వీరుడిగా సర్వాయి పాపన్న గుర్తింపు పొందాడు.
ఈయన కార్యక్రమాలు సమసమాజ స్థాపన, కుల వ్యవస్థ ధిక్కరణ, రైతాంగ రక్షణ మొదలైన అంశాల చుట్టూ కేంద్రీకృతమయ్యాయని కొంత మంది మేధావులు విశ్లేషించారు. పాపన్న సైన్యంలో హిందూ, ముస్లిం, అటవిక తెగలవారు ఉన్నారని జానపద సాహిత్యం తెలియజేస్తుంది. వీరితోపాటు వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు కూడా పాపన్నకు మద్దతు ప్రకటించారు.