Chiranjeevi: నా సినీ జీవితానికి స్ఫూర్తినిచ్చిన హీరోలు వాళ్ళే.. ‘వేవ్స్‌’ సమ్మిట్‌లో మెగాస్టార్ చిరంజీవి

Chiranjeevi: నా సినీ జీవితానికి స్ఫూర్తినిచ్చిన హీరోలు వాళ్ళే.. ‘వేవ్స్‌’ సమ్మిట్‌లో మెగాస్టార్ చిరంజీవి

ముంబైలో గురువారం మే1న జరిగిన WAVES 2025 సమ్మిట్‌లో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి తన జీవిత విషయాలను పంచుకున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హోస్ట్ గా వ్యవహరించగా.. హేమమాలిని, మోహన్‌లాల్‌తో కలిసి ప్యానల్ డిస్కషన్‌లో చిరంజీవి పాల్గొన్నారు. సినీ పరిశ్రమలో మాములు నటుడ్ని నుంచి మెగాస్టార్‌గా ఎదగడంపై తన అనుభవాలను చిరు పంచుకున్నారు

చిరంజీవి మాట్లాడుతూ ‘బాల్యంలో నేను ఎక్కువగా డ్యాన్సులు చేసి ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్‌‌ను ఎంటర్‌‌‌‌టైన్ చేస్తుండేవాడిని. అలా నటనపై నాకు ఆసక్తి మొదలైంది. చివరకు మద్రాసుకి వెళ్లి ఫిల్మ్ ఇన్‌‌స్టిట్యూట్‌‌లో జాయిన్ అయ్యాను.

అప్పటికే ఎన్టీఆర్ గారు, ఏఎన్నార్ గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు ఇలా అరడజనుకు పైగా స్టార్ హీరోలున్నారు. అలాంటి వారి మధ్య నాకు అసలు అవకాశం వస్తుందా అని అనుకున్నాను. అందరి కంటే భిన్నంగా ఏం చేయగలను అని ఆలోచించాను. అప్పుడే ఫైట్స్, డ్యాన్స్ విషయంలో మరింత శిక్షణ తీసుకున్నాను. అవే ఇప్పుడు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయి.

మేకప్ లేకుండా సహజంగా నటించడం మిథున్ చక్రవర్తి , స్టంట్స్ విషయంలో అమితాబ్, డ్యాన్స్ విషయంలో నా సీనియర్ కమల్ హాసన్ నాకు స్ఫూర్తిగా నిలిచారు. అందరినీ చూస్తూ, పరిశీలిస్తూ నన్ను నేను మల్చుకుంటూ ఈ స్థాయికి వచ్చాను’ అని అన్నారు.

కేంద్రం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నఈ వేవ్స్ కార్యక్రమంలో ఇండియ‌‌న్ సినిమాల గురించి మాత్రమే కాదు. ఓటీటీలు, కామిక్స్‌‌, డిజిట‌‌ల్ మీడియా, యానిమేష‌‌న్‌‌, వీఎఫ్ ఎక్స్ సహా  సినీ ప‌‌రిశ్రమ‌‌కు సంబంధించిన ఎన్నో విష‌‌యాల‌‌పై చ‌‌ర్చిస్తున్నారు.