చలో గజ్వేల్ ను అడ్డుకున్న పోలీసులు.. కామారెడ్డిలో హై టెన్షన్

చలో గజ్వేల్ ను అడ్డుకున్న పోలీసులు.. కామారెడ్డిలో హై టెన్షన్

బీజేపీ నేతలు, కార్యకర్తల అరెస్ట్ 
మద్దతు తెలిపేందుకు వస్తున్న దుబ్బాక ఎమ్మెల్యే అడ్డగింత 
హెచ్​ఆర్​సీకి కంప్లయింట్ చేస్తామన్న రఘునందన్​రావు 
సాయంత్రం సమయంలోవెంకటరమణారెడ్డి రిలీజ్

కామారెడ్డి/కామారెడ్డి టౌన్ / పిట్లం, వెలుగు: బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన కామారెడ్డి టూ చలో గజ్వేల్​ ప్రోగ్రామ్​ను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. వందలాది మంది బీజేపీ లీడర్లు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. పోలీస్​స్టేషన్లలో ఉన్న లీడర్లను కలిసేందుకు వస్తున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునంద్​రావుతో  పాటు ఇతర నేతలను కూడా మధ్యలోనే అడ్డగించారు. అరెస్టు సందర్భంగా పోలీసులు, పార్టీ శ్రేణుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. చలో గజ్వేల్ ​కోసం తెచ్చిన వాహనాలను పోలీస్​స్టేషన్లకు తరలించారు. దీంతో కామారెడ్డిలో హై టెన్షన్​ నెలకొంది.  

గురువారం నుంచే కొనసాగిన అరెస్టుల పర్వం

వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్​ కామారెడ్డి నుంచి పోటీ చేయనున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో గజ్వేల్​నియోజకవర్గంలో ఏం అభివృద్ధి జరిగిందో నియోజకవర్గ ప్రజలకు స్వయంగా చూపిస్తామని బీజేపీ నియోజకవర్గ ఇన్​చార్జి కాటిపల్లి వెంకటరమణారెడ్డి చలో గజ్వేల్ ప్రోగ్రామ్​కు పిలుపునిచ్చారు. 100 వెహికిల్స్​లో శుక్రవారం పార్టీ శ్రేణులతో పాటు, ఆయా వర్గాల ప్రజలను కామారెడ్డి నుంచి గజ్వేల్​కు తీసుకెళ్లనున్నట్లు ప్రకటించారు. 

దీని కోసం రెడీ అవుతున్న తరుణంలో గురువారం రాత్రి ఆయనను, అనుచరులను, ఇతర లీడర్లను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.  వీరిని కామారెడ్డికి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిచ్కుంద  పోలీస్ స్టేషన్​కు తరలించారు. అంతకు ముందు చాలా ప్రాంతాల్లో తిప్పారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడక్కడా వారి వాహనాలను కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించగా చెదరగొట్టారు. తనను, కార్యకర్తలను, లీడర్లను అరెస్టులు చేసినా  ‘చలో గజ్వేల్’ ఆగదంటూ వెంకటరమణారెడ్డి స్పష్టం చేశారు.  

జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత

గజ్వేల్ వెళ్లేందుకు శుక్రవారం ఉదయం  పెద్ద సంఖ్య లో పార్టీ కార్యకర్తలు, జనాలు జిల్లా కేంద్రంలోని బీజేపీ ఇన్​చార్జి కాటిపల్లి వెంకటరమణా రెడ్డి ఇంటికి  చేరుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ‘  పోతాం..పోతాం..గజ్వేల్.. చూస్తాం.. చూస్తాం..గజ్వేల్’ అని నినదించారు.  వీరందరిని అరెస్టు చేసి పలు పోలీస్​ స్టేషన్లకు తరలించారు. గజ్వేల్ ​వెళ్లేందుకు కిరాయికి తీసుకొచ్చిన వాహనాలను సైతం దేవునిపల్లి స్టేషన్​కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు, పార్టీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. 

భారీ సంఖ్యలో మోహరించిన పోలీసు బలగాలు వచ్చిన వారిని వచ్చినట్టే అరెస్ట్ ​చేసి పలు పోలీస్​ స్టేషన్లకు తరలించాయి. కార్యకర్తలను ఈడ్చుకెళ్లి వాహనాల్లో ఎక్కించారు. మహిళా కార్యకర్తలనూ వదల్లేదు. దీంతో ఉద్రిక్తత వాతవరణం నెలకొంది. కొద్దిసేపటికే తరలివచ్చిన మరింత మంది కార్యకర్తలు అరెస్టులకు నిరసనగా జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్​ వద్ద రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు.  మరోవైపు అరెస్టయిన వారు పోలీస్​ స్టేషన్లలో ఆందోళనలకు దిగారు. ఆశోక్​నగర్ ​కాలనీ రోడ్డు వద్ద ఉన్న శివాజీ విగ్రహానికి పాలాభిషేకం చేసి కొందరు కార్యకర్తలు గజ్వేల్​కు తరలివెళ్లారు. 

పెద్దకొడపల్​ వద్ద ఎమ్మెల్యే అడ్డగింత

బిచ్కుంద పోలీస్ స్టేషన్​లో ఉన్న కాటిపల్లి వెంకటరమణా రెడ్డితో పాటు, పార్టీ శ్రేణులను కలిసేందుకు వస్తున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​రావు,  జహీరాబాద్ ​పార్లమెంట్​ఇన్​చార్జి బద్దం మహిపాల్​రెడ్డిలను పెద్ద కొడప్​గల్​వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఎందుకు అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే రఘునందర్​రావు ప్రశ్నించినా సరైన సమాధానం చెప్పలేదు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు, పోలీసులకు మధ్య  వాగ్వాదం జరిగింది.  

కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఎట్టిపరిస్థితుల్లోనూ వెనుతిరిగేది లేదంటూ ఎమ్మెల్యే అక్కడే ఉన్నారు. చివరకు సాయంత్రం బిచ్కుంద పోలీస్ స్టేషన్​లో ఉన్న వెంకటరమణారెడ్డితో పాటు, కార్యకర్తలను పోలీసులు వదిలిపెట్టడంతో వారంతా పెద్దకొడప్​గల్​ చేరుకున్నారు. ఎమ్మెల్యే రఘునందన్​రావు, పార్టీ జిల్లా ప్రెసిడెంట్​ అరుణ తార, ఇన్​చార్జి మహిపాల్​రెడ్డి , బాన్స్​వాడ ఇన్​చార్జి మల్యాద్రిరెడ్డిలను కలుసుకున్నారు. 

త్వరలో గజ్వేల్ వెళ్తాం

ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడికైనా వెళ్లవచ్చని, మాట్లాడొచ్చని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​రావు అన్నారు. పెద్దకొడప్​గల్​లో మాట్లాడుతూ గజ్వేల్​కు వెళ్లనివ్వకుండా పోలీసులు  అడ్డుకుంటున్నారంటే  అక్కడ జరిగింది అభివృద్ధా? విధ్వంసమా?  అన్నది ప్రజలు అలోచించాలన్నారు. నిజంగా అభివృద్ధి చేస్తే అడ్డుకోవడం ఎందుకన్నారు. వెంకటరమణా రెడ్డి గజ్వేల్​ను బద్దలు కొట్టడానికి వెళ్తామనలేదని, కామారెడ్డిలో  కేసీఆర్​ పోటీ చేయనున్న దృష్ట్యా  అక్కడ ఏం అభివృద్ధి జరిగిందో ఇక్కడి ప్రజలకు చెప్పేందుకు ప్రోగ్రామ్ ​చేపట్టారన్నారు. 

 ఇది చట్ట వ్యతిరేక ప్రోగ్రామ్​ కాదన్నారు.  గజ్వేల్​లో వాస్తవంగా ఏం జరిగిందో  ప్రజలకు  తెలియజేప్పేందుకు త్వరలోనే  చలో గజ్వేల్​ ప్రోగ్రామ్​ నిర్వహించి తీరతామన్నారు. 24 గంటల పాటు లీడర్లను, కార్యకర్తలను పీఎస్​లలో ఉంచారని, తమ కార్యకర్తలపై లాఠీచార్జీ చేయడం ఏమిటని ప్రశ్నించారు. దీనిపై సోమవారం మానవ హక్కుల కమిషన్​కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

అభివృద్ధి జరిగితే భయమెందుకు 

గజ్వేల్​లో అభివృద్ధి జరిగితే  ప్రభుత్వానికి భయమెందుకని బీజేపీ నేత కాటిపల్లి వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు.  స్టేషన్​నుంచి విడుదలైన తర్వాత ఆయన మాట్లాడుతూ.. ఉద్యమ టైంలో అప్పటి ప్రభుత్వం గిట్లనే అరెస్టులుచేస్తే  ప్రత్యేక రాష్ట్రం వచ్చేదా అని అన్నారు. రింగ్​రోడ్డు పేరుతో గజ్వేల్​లో షాడో ఎమ్మెల్యేలు రైతుల భూములు కాజేశారన్నారు. త్వరలోనే చలో గజ్వేల్ ​నిర్వహించి తీరతామన్నారు.