
హైదరాబాద్: బీజేపీకి ఎంఐఎం బీ టీమ్ అన్న ఆరోపణలపై ఆ పార్టీ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం (మే 18) ఓ జాతీయ మీడియా ఛానెల్‌తో ఆయన మాట్లాడుతూ.. బీజేపీకి మేం బీ టీమ్ కాదని.. దేశంలో బీజేపీ వరుస విజయాలకు కారణం ప్రతిపక్షాలేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ దేశంలోని హిందూ ఓట్లను ఏకీకృతం చేసిందని.. ఈ విషయంలో ప్రతిపక్షం విఫలమైందన్నారు.
బీజేపీకి ఎంఐఎం బీ టీమ్ అని ప్రతిపక్షాలు చేస్తోన్న ఆరోపణలు ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తున్న తన పార్టీ పట్ల వాళ్లకు ఉన్న ద్వేషం తప్ప మరొకటి కాదని పేర్కొన్నారు. బీజేపీ హిందువులను ఏకీకృతం చేసినట్లు.. ప్రతిపక్షాలు మెనార్టీలను ఏకం చేయలేకపోతున్నాయని.. ప్రతిపక్షం నకిలీది కావడం వల్లే ఎన్నికల్లో బీజేపీ వరుస విజయాలు సాధిస్తోందన్నారు. దేశంలోని 50 శాతం హిందూ ఓట్లను ఏకీకృతం చేయడం వల్లే బీజేపీ వరుసగా గెలుస్తోందన్నారు. కానీ ప్రతిపక్ష పార్టీలు మాత్రం ముస్లిం ఓట్లను తేలికగా తీసుకుంటున్నాయని, వారి ఆందోళనలను పట్టించుకోవట్లేదన్నారు.
ALSO READ | కేంద్రం ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చెయ్యాలి: బండి సంజయ్
దేశంలో దాదాపు 15 శాతం జనాభా ఉన్న అతిపెద్ద మైనారిటీ సమూహం ముస్లింలు అయినప్పటికీ.. చట్టసభలు, పార్లమెంటులో ముస్లింల భాగస్వామ్యం కేవలం 4 శాతం మాత్రమే ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంత పెద్ద సమాజాన్ని అణగదొక్కడం, బలహీనపర్చడం ద్వారా భారతదేశం 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించలేదని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు ముస్లింలను ఓటు బ్యాంకులుగా చూడటం మానేసి, వారికి విద్య, ఉద్యోగాలు ఇవ్వడానికి కృషి చేయాలని కోరారు.