
కేంద్రం తెలంగాణకు ఇచ్చిన నిధులపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు కేంద్రమంత్రి బండి సంజయ్. కేంద్రం, రాష్ట్రం కలిసి పనిచేస్తేనే అభివృద్ధి కానీ ఇక్కడి ప్రభుత్వం కేవలం విమర్శలకే పరిమితమవుతోందన్నారు. దీనివల్ల తెలంగాణ రాష్ట్రం నష్టపోతోందన్నారు.
మీడియాతో మాట్లాడిన బండి సంజయ్..మే 22న దేశ వ్యాప్తంగా 102 రైల్వే స్టేషన్లను ప్రధాని మోడీ వర్చువల్ గా ప్రారంభిస్తారని చెప్పారు. తెలంగాణలోని బేగంపేట, వరంగల్, కరీంనగర్ రైల్వే స్టేషన్లను కూడా మోడీ ప్రారంభిస్తారన్నారు. తెలంగాణలో 2 వేల కోట్లతో 40 రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్ల స్కీం కింద అభివృద్ధి చేస్తున్నాం. కేవలం 21 నెలల్లో కరీంనగర్ అభివృద్ధి పనులు 95 శాతం పూర్తి చేశాం. కరీంనగర్ రైల్వే స్టేషన్ ను సర్వాంగ సుందరంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేశాం. త్వరలోనే జమ్మికుంట రైల్వే స్టేషన్ కూడా ఆధునికీకరిస్తాం. కరీంనగర్ –తీగలగుట్టపల్లి ఆర్వోబీ పనులు కూడా త్వరలోనే పూర్తవుతాయి. హుజురాబాద్ నియోజకవర్గంలోని ఉప్పల్ ఆర్వోబీ పనులు కూడా తొందరగా పూర్తి చేయాలని ఆదేశించాం.
ALSO READ | ఆఫీసర్లపై మంత్రి జూపల్లి ఫైర్
తెలంగాణలో జరుగుతున్న పనులకు ఖర్చు చేస్తున్న నిధులన్నీ కేంద్రానివే. తెలంగాణలో రూ.32 వేల 950 కోట్లతో రైల్వే అభివృద్ధి పనులు చేస్తున్నాం. రూ.750 కోట్లతో సికింద్రాబాద్, రూ. 350 కోట్లతో నాంపల్లి రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేస్తున్నాం. ఒక్క ఏడాదిలోనే 5 వేల కోట్ల రైల్వే పనులు చేపట్టాం. ఇంత చేస్తున్నా బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు కేంద్రం ఏమీ చేస్తలేదని ఆరోపిస్తున్నారు. లక్షన్నర కోట్లు నేషనల్ హైవే కోసం ఖర్చు చేస్తున్నా.. ఏమీ చేయడం లేదని అనడం దారుణం. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని బస్టాండ్లు అభివృద్ధి చేసిందో చెప్పాలి.రాష్ట్రానికి ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయడానికి మేం సిద్దం..రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమా అని సవాల్ విసిరారు బండి సంజయ్.