ఆఫీసర్లపై మంత్రి జూపల్లి ఫైర్

ఆఫీసర్లపై మంత్రి జూపల్లి ఫైర్
  •   వడ్ల కొనుగోళ్లపై రివ్యూ
  •   మిల్లర్ల గైర్హాజరుపై సీరియస్

వనపర్తి, వెలుగు: వడ్ల కొనుగోలులో క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని, దీనిని సహించేది లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పని లేక సమీక్ష సమావేశం పెట్టుకున్నామా? సమావేశానికి ఐకేపీ, పీఏసీఎస్​ సెంటర్ల నిర్వాహకులు, మిల్లర్లు హాజరు కావాలని చెబితే ఎందురు రాలేదు.’ అని ఫైర్​ అయ్యారు. 74 మంది మిల్లర్లలో 20 మంది హాజరయ్యారు. కలెక్టర్, అడిషనల్​ కలెక్టర్, డీఎస్​వో, మంత్రి చెప్పినా సమావేశానికి రాకపోవడం ఏమిటి? అంటూ అధికారులను నిలదీశారు.

మరోసారి పునరావృతం కాకుండా చూడాలని, రుతుపవనాలు త్వరగా వస్తాయని చెబుతున్నారని, అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా కొనుగోళ్లు పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలోని మిల్లర్లు రూ.700 కోట్ల విలువైన బియ్యం, వడ్లు అమ్ముకుని ప్రభుత్వానికి బకాయిపడ్డారని, వాటిని ముక్కుపిండి వసూలు చేస్తామని తెలిపారు. మిల్లర్లు రైతులను పిలిచి తరుగు పంచాయతీ పెడితే సహించేది లేదన్నారు.

కొనుగోలులో ఆలస్యానికి లారీల కొరతేనని స్పష్టంగా కనిపిస్తోందని, ఏడుగురు ట్రాన్స్​పోర్టు కాంట్రాక్టర్లు ఒక్కొక్కరు 50 లారీలు పెడుతున్నారనేది అబద్దమని అన్నారు. ఆదివారం ఉదయం కలెక్టరేట్​లో ప్రతి ట్రాన్స్​పోర్టు కాంట్రాక్టరు 50 లారీలు పెట్టాలని, అది జూమ్​కాల్​లో ప్రదర్శించాలని మంత్రి అడిషనల్​ కలెక్టర్​ను ఆదేశించారు. కలెక్టర్​ ఆదర్శ్​ సురభి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్​రెడ్డి, డీసీసీబీ చైర్మన్​ విష్ణువర్ధన్​రెడ్డి, ఏఎంసీ చైర్మన్​ శ్రీనివాస్​గౌడ్​ పాల్గొన్నారు.