పేదల భూముల్ని కేసీఆర్ బడా వ్యాపారులకు అమ్ముతున్నరు: కిషన్ రెడ్డి

పేదల భూముల్ని కేసీఆర్ బడా వ్యాపారులకు అమ్ముతున్నరు: కిషన్ రెడ్డి

రానున్న ఎన్నికల్లో బీఆర్​ఎస్​ ప్రభుత్వం అధికారంలోకి రాదని తెలిసే సీఎం కేసీఆర్​ భూముల అమ్మకానికి పూనుకున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి ఆరోపించారు. 

ఆగస్టు 14న ఆయన హైదరాబాద్​లో మీడియాతో మాట్లాడుతూ.. కోకాపేట తదితర ప్రాంతాల విలువైన భూముల్ని అమ్మి పేదలకు మోసం చేస్తూ.. బడా వ్యాపారులకు లాభం చేకూరుస్తున్నారని అన్నారు. వచ్చిన డబ్బుతో ఎన్నికల్లో విచ్చలవిడిగా మద్యం పంచి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. 

రాష్ట్రం మొత్తం దివాలా తీస్తున్నా కేసీఆర్​ పట్టించుకోవట్లేదన్నారు. భూముల అమ్మకం ఇక్కడితో ఆపరని ప్రజలు ప్రభుత్వాన్ని ఈ విషయంపై ప్రశ్నించాలని కోరారు. పేదలకు పంచడానికి ప్రభుత్వం దగ్గర భూమి ఉండదు కానీ, బడా వ్యాపారులకు అమ్మడానికి ఎలా వస్తోందని ప్రశ్నించారు. 

భావి తరాల కోసం రక్షించాల్సిన భూములను అమ్ముకుంటూ వెళ్తే రాష్ట్రంలో ఒక్క ఎకరా భూమి కూడా ప్రభుత్వం దగ్గర ఉండదని హితవు పలికారు.  ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మంత్రి కేటీఆర్ ప్రభుత్వ​భూముల అమ్మకాన్ని వ్యతిరేకించిన వీడియోను ఆయన ప్రదర్శించారు.  

కల్వకుంట్ల కుటుంబం పేదల నుంచి అక్రమంగా ల్యాండ్స్​ని లాక్కుంటోందని కిషన్​రెడ్డి ఆరోపించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని అప్పుడు బీఆర్​ఎస్ ప్రభుత్వ దోపిడీ అరాచకాలను బయటపెడతామని ఆయన హెచ్చరించారు.