KCR నిద్రలోనూ BJPనే కలవరిస్తున్నారు : లక్ష్మణ్

KCR నిద్రలోనూ BJPనే కలవరిస్తున్నారు : లక్ష్మణ్

బీజేపీలో చేరిన తర్వాత తొలిసారిగా పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు మాజీమంత్రి పెద్దిరెడ్డి, చాడ సురేష్ రెడ్డి,  బోడ జనార్ధన్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ తో సమావేశమైన రాజకీయాలపై చర్చించారు. ఆ తర్వాత నాయకులు మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో అన్నిదారులు బీజేపీ వైపే ఉన్నాయన్నారు లక్ష్మణ్. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఒక స్పష్టత వచ్చిందన్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్రజల విశ్వాసం కోల్పోతోందన్నారు. కేసీఆర్ నిద్రలో కూడా బీజేపీని కలవరిస్తున్నారన్న లక్ష్మణ్.. బీజేపీకి భయపడి అసహనంతో కేసీఆర్ మాట్లాడుతున్నారని అన్నారు. టీఆర్ఎస్ లో అంతర్మథనం మొదలైందన్నారు. జిల్లాకో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇస్తానన్న విషయం మర్చిపోయి టీఆర్ఎస్ ఆఫీసులు కడుతున్నారనీ.. ఉద్యమాల ద్వారా బీజేపీ ఒక తిరుగులేని శక్తిగా తయారవుతుందని చెప్పారు. పీవీని బీజేపీ గౌరవిస్తుందనీ.. ఆయనకు నివాళులు అర్పించే టైమ్ కూడా  కేసీఆర్ కు లేదని అన్నారు లక్ష్మణ్. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏమయ్యిందని ప్రశ్నించారు.

TDP నాయకులు బీజేపీ సభ్యత్వం తీసుకోండి : పెద్దిరెడ్డి

మూడున్నర దశాబ్దాలు టీడీపీలో పని చేసిన తాను.. రాష్ట్రానికి బీజేపీ అవసరం కాబట్టే పార్టీ మారానన్నారు పెద్దిరెడ్డి. “ఇప్పుడున్న అసెంబ్లీ, సచివాలయం నుండి పాలన సాగిస్తే తన కుమారుడు సీఎం కారని ఏ స్వామి చెప్పారో, ఏ పండితుడు చెప్పాడో ? టీడీపీ నాయకులందరూ బీజేపీ సభ్యత్వం తీసుకోవాలని పిలుపునిస్తున్నా. బీజేపీకే మైనారిటీ ఓట్లు పడతాయని మాజీ మంత్రి బోడ జనార్ధన్ చెప్పారు.