
హైదరాబాద్, వెలుగు: పీఎం అవాస్ యోజన స్కీమ్ నిధులతో అర్బన్ ఏరియాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను పీఎంవో ఆఫీస్ డైరెక్టర్ మన్మీత్ కౌర్ పరిశీలించారు. బుధవారం ఖైరతాబాద్ ఇందిరా నగర్, బన్సీలాల్ పేట్ లోని జీవై. రెడ్డి నగర్ లో నిర్మించిన ఇండ్లను పరిశీలించారు. మొదట ఇందిరా నగర్లో డబుల్ ఇండ్లను పరిశీలించి లబ్ధిదారుల ఇంట్లోకి వెళ్లి స్వయంగా ఆమె మాట్లాడారు. ఇండ్లు మంజూరు కానప్పుడు ఎక్కడ ఉన్నారని లబ్ధిదారులను ఆమె అడిగారు. డబుల్ బెడ్రూం ఇండ్లపై సోలార్ పవర్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
అనంతరం సెక్రటేరియెట్ లో మున్సిపల్ శాఖ, హౌసింగ్ శాఖ, జీహెచ్ఎంసీ అధికారులతో పీఎంవో డైరెక్టర్ రివ్యూ నిర్వహించారు. జీహెచ్ఎంసీలో లక్ష ఇండ్లకు 70 వేల ఇండ్లు పూర్తి అయ్యాయని, మిగతా 30 వేల ఇండ్లను త్వరలోనే పూర్తి చేస్తామని హౌసింగ్ సెక్రటరీ గౌతమ్ తెలిపారు. పట్టణ ప్రాంతాల్లోను త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లను స్టార్ట్ చేయనున్నామని, స్థలాల కొరత నేపథ్యంలో టవర్ల రూపంలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన పీఎంవో డైరెక్టర్‌కు వివరించారు.