బీఆర్ఎస్పొలిటికల్ బతుకమ్మ..! కాంగ్రెస్ సర్కార్‌‌‌‌నువిమర్శిస్తూ పాటల ఆల్బమ్

బీఆర్ఎస్పొలిటికల్ బతుకమ్మ..! కాంగ్రెస్ సర్కార్‌‌‌‌నువిమర్శిస్తూ పాటల ఆల్బమ్

హైదరాబాద్, వెలుగు:  కాంగ్రెస్​ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పేరడీ బతుకమ్మ పాటలను బీఆర్ఎస్ రూపొందించింది. ఈ పాటలను గురువారం తెలంగాణ భవన్‌‌లో బీఆర్ఎస్ మహిళా నేతలు విడుదల చేశారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రతి పథకం వెనుక ఆడబిడ్డల సంక్షేమం ఉన్నదని, ఆ స్కీమ్‌‌లను ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి నిలిపివేస్తున్నారని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. 

కాంగ్రెస్​సర్కార్ వైఫల్యాలపై మూడు బతుకమ్మ పాటలు ప్రత్యేకంగా రాయించామని పద్మాదేవేందర్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ ఆడబిడ్డలకు బతుకమ్మ  చీరలు కానుకగా ఇచ్చారని ఎమ్మెల్యే కోవా లక్ష్మి పేర్కొన్నారు. తెలంగాణలో అందరికీ ఇష్టమైన పండుగ బతుకమ్మ -అని, ఈ పాటల్లో తెలంగాణ భాష తియ్యదనం ఉంటుందని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ చెప్పారు.

 సమావేశంలో సత్యవతి రాథోడ్, సునీతా లక్ష్మారెడ్డి, మాలోతు కవిత, తుల ఉమ తదితరులు పాల్గొన్నారు. కాగా, బతుకమ్మ వేడుకలు ముగిసే వరకూ రాష్ర్టవ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ ఈ పాటలు మార్మోగించాలని కార్యకర్తలను పార్టీ పెద్దలు ఆదేశించినట్టు తెలిసింది. బతుకమ్మ పండుగ అంటే తెలంగాణ ఆత్మ. ఈ గడ్డకు ప్రత్యేకమైన పూల పండుగ. ఈ పండుగ టైమ్‌‌లో పురాణ గాథలు, రామాయణ, మహాభారత ఘట్టాలను పాటలుగా పాడుతూ ఉంటారు. కానీ ఇలాంటి పాటలకు పేరిడీ చేసి ‘‘మార్పుమార్పని వలలో.. మనలను ముంచిండ్రే వలలో..’, ‘ఆరు గ్యారంటీలు ఉయ్యాలో.. ఆగమే జేసిండ్రు ఉయ్యాలో..’ అంటూ రాజకీయ విమర్శలను జోడించడంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.  

కవిత పేరెత్తలేదు..  

తెలంగాణ ఉద్యమ పార్టీగా అవతరించిన బీఆర్ఎస్.. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలు, పబ్బాలను, ముఖ్యంగా బతుకమ్మ, బోనాలను తన పోరాట ప్రతిరూపాలుగా మలుచుకుంది. ఇందులో భాగంగా బతుకమ్మ వేడుకలను తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో కవిత అన్నీ తానై నిర్వహిస్తూ వచ్చారు. ప్రతి జిల్లాలో బతుకమ్మను పేర్చి, ఆడిపాడడం ద్వారా తనను తాను బతుకమ్మకు బ్రాండ్ అంబాసిడర్‌‌‌‌గా నిలుపుకునే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు కవితను పార్టీ​నుంచి సస్పెండ్​చేయడంతో ఆమె ప్లేసులోకి కేసీఆర్ వచ్చి చేరారు. తొలిసారి కవిత పేరు ప్రస్తావించకుండా తెలంగాణ భవన్‌‌లో బతుకమ్మ వేడుకలకు అంకురార్పణ జరిగింది. 

మొన్నటి వరకు బతుకమ్మకు కవితమ్మ.. బ్రాండ్ అంబాసిడర్ అన్న వాళ్లంతా ఇప్పుడు మాట మార్చేశారు. బతుకమ్మ పాటల రిలీజ్​సందర్భంగా ‘బతుకమ్మకు బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్’ అంటూ మహిళా నేతలు నినదించారు. కాగా, బతుకమ్మ వేడుకల్లో భాగంగా కవిత  ప్రత్యేకంగా పాటలు రెడీ చేయించేవారు. అందులో రాజకీయాలకు తావులేకుండా బతుకమ్మ  ప్రాశస్త్యం, సంస్కృతి సంప్రదాయాల కలబోతగా ఉండేవి. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో విడుదల చేసిన బతుకమ్మ పాటలన్నీ రాజకీయ పాటలే కావడం విమర్శలకు తావిస్తున్నది.