రూ. 200కోట్ల మోసం.. శికళ బినామీ సంస్థల్లో ఈడీ సోదాలు

రూ. 200కోట్ల మోసం.. శికళ బినామీ సంస్థల్లో ఈడీ సోదాలు
  • 200 కోట్ల బ్యాంకు మోసం కేసులో హైదరాబాద్, చెన్నైలో తనిఖీలు

హైదరాబాద్, వెలుగు: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు వీ.కే. శశికళతోపాటు మరికొందరిపై నమోదైన రూ.200 కోట్ల బ్యాంకు(కెనరా) మోసం కేసులో ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం హైదరాబాద్, చెన్నైలో సోదాలు నిర్వహించింది. ఈ కేసులో మార్గ్ గ్రూప్‌‌కు చెందిన జీఆర్‌‌కే రెడ్డి శశికళ బినామీగా ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.

 కెనరా బ్యాంకులో జరిగిన రూ.200 కోట్ల మోసానికి సంబంధించి గతంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఎఫ్‌‌ఐఆర్ నమోదు చేసింది. ఈ ఎఫ్‌‌ఐఆర్ ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ దర్యాప్తును ప్రారంభించింది. ఈ క్రమంలోనే హైదరాబాద్, చెన్నైలోని శశికళ బినామీ మార్గ్ గ్రూప్ సంస్థలతో పాటు జీఆర్‌‌కే రెడ్డి సహా మరికొందరి నివాసాల్లో తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. మార్గ్ గ్రూప్‌‌లోని కొన్ని ఆస్తులకు జీఆర్‌‌కే రెడ్డి శశికళ బినామీగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపిస్తూ ఇన్‌‌కమ్ ట్యాక్స్ విభాగం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. ఈ బినామీ ఆస్తుల దర్యాప్తులో భాగంగా మార్గ్ గ్రూప్ సంస్థల్లో సోదాలు చేసినట్లు తెలిపారు. ఈ కేసులో శశికళ పేరు సీబీఐ ఎఫ్‌‌ఐఆర్‌‌లో నమోదు కానప్పటికీ, ఆమె బినామీగా గుర్తించబడిన జీఆర్‌‌కె రెడ్డితో సంబంధం ఉన్న ఆస్తులపై దర్యాప్తు కొనసాగుతోంది.