
- కులగణన, డెడికేటెడ్ కమిషన్ రిపోర్టుల ఆధారంగా ఆమోదం తెలిపే చాన్స్
- గత కేబినెట్ భేటీల్లోని నిర్ణయాల అమలు పైనా సమీక్ష
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం 2 గంటలకుసెక్రటేరియెట్లో కేబినెట్ సమావేశం జరుగనుంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై ఇందులో చర్చించి, తదుపరి కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోసం 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని రాజ్యాంగ సవరణ ద్వారా ఎత్తివేసినప్పుడు, బీసీలకు రిజర్వేషన్లు పెంచడంలో ఎందుకు సాధ్యం కాదనే వాదనను రాష్ట్ర ప్రభుత్వం వినిపిస్తున్నది. దీనిపై న్యాయ సలహా కూడా తీసుకోగా.. రిజర్వేషన్లు పెంచుకునేందుకు అవకాశం ఉన్నదని సూచన వచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం నిరుడు నవంబర్, డిసెంబర్ నెలల్లో చేసిన సమగ్ర కుల గణన సర్వే వివరాలు, డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా రిజర్వేషన్లు పెంచుతూ కేబినెట్లో ఆమోదం తీసుకుని.. ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది.
ఒకవేళ దీనిపై ఎవరైనా కోర్టుకు వెళ్తే.. బలంగా వాదించాలని భావిస్తున్నది. ఈ నిర్ణయం అమలైతే స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగ అవకాశాల్లో కూడా బీసీ రిజర్వేషన్లు ప్రస్తుతం ఉన్న 29 శాతం నుంచి 42 శాతానికి పెరిగేందుకు మార్గం సుగమం అవుతుంది. ఒకవేళ కోర్టులు కొట్టివేస్తే.. స్థానిక ఎన్నికల్లో పార్టీ పరంగా ఇచ్చి ముందుకు వెళ్లాలని భావిస్తున్నది. మంత్రివర్గ సమావేశంలో కేవలం బీసీ రిజర్వేషన్ల పెంపుపైనే కాకుండా, గత కేబినెట్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల అమలుపైనా సమీక్షించనున్నారు. 2023 డిసెంబర్ 7 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 18 సార్లు కేబినెట్ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో సుమారు 315 పైచిలుకు అంశాలపై చర్చలు జరిగాయి. రేషన్ కార్డుల పంపిణీ, వ్యవసాయం, బనకచర్లతో పాటు ఇతర ప్రాజెక్టులపై గురువారం నాటి కేబినెట్ భేటీలో చర్చించనున్నారు.