శ్రీవారి బ్రహ్మోత్సవాలపై అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు..

శ్రీవారి బ్రహ్మోత్సవాలపై అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు..

తిరుమలలో సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రిసెప్షన్ విభాగంపై సమీక్షా సమావేశం నిర్వహించారు టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి. బుధవారం ( సెప్టెంబర్ 18 ) తిరుమలలోని అన్నమయ్య భవన్ లో జరిగిన ఈ సమావేశంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు వెంకయ్య చౌదరి. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వసతి గదుల కేటాయింపునకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 

బ్రహ్మోత్సవాలకు విచ్చేసే వీఐపీలకు వసతి సౌకర్యంలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా రిసెప్షన్, ప్రోటోకాల్ విభాగాలు సమన్వయంతో పని చేయాలని అన్నారు. విశ్రాంతి గృహాలను పరిశీలించి ఏవైనా మరమ్మతులు ఉంటే త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు వెంకయ్య చౌదరి. ఆలయంలో విధులు నిర్వహించే ఉద్యోగులు క్రమశిక్షణతో బాధ్యతాయుతంగా పని చేయాలని సూచించారు.

ఈ సమావేశానికి ముందు ఆయన అన్న ప్రసాద విభాగ బ్రహ్మోత్సవ ఏర్పాట్లను కూడా సంబంధిత అధికారులతో సమీక్షించారు.ఈ సమావేశంలో సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, రిసెప్షన్ డిప్యూటీ ఈవో శ్రీ భాస్కర్, వీజీవో శ్రీ సురేంద్ర, ఓఎస్డీ సత్రా నాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.