జూలై 15లోగా కమిటీల నియామకాలు పూర్తవ్వాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ అనిల్‌

జూలై 15లోగా కమిటీల నియామకాలు పూర్తవ్వాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ అనిల్‌
  • ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతలకు మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ అనిల్‌‌‌‌ యాదవ్‌‌‌‌ ఆదేశం
  • అర్హులైనవారి పేర్లతో వెంటనే జాబితాను పంపించాలని సూచన

హైదరాబాద్, వెలుగు: ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని అన్ని గ్రామ, మండల, జిల్లా కమిటీల నియామకాలను ఈ నెల 15లోగా పూర్తి చేయాలని పార్టీ నేతలను మంత్రి వివేక్ వెంకటస్వామి, ఆ జిల్లా పీసీసీ ఇన్‌‌‌‌చార్జి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ఆదేశించారు. ఇందుకోసం వెంటనే జాబితాను తమకు అందజేయాలని సూచించారు. ఈ నెల 15లోపు సంస్థాగత కమిటీల నియామకం పూర్తి చేయాలని రాష్ట్ర పార్టీ ఇన్‌‌‌‌చార్జి మీనాక్షి నటరాజన్ ఆదేశించడంతో గత నాలుగు రోజులుగా రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాల పార్టీ ఇన్‌‌‌‌చార్జిలు ఆయా జిల్లాల నేతలలో వరుస మీటింగ్‌‌‌‌లు నిర్వహిస్తున్నారు. 

ఇందులో భాగంగానే బుధవారం గాంధీ భవన్‌‌‌‌లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గ్రామ, మండల, జిల్లా కమిటీల నియామకంపై.. ఆ జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ ఇన్‌‌‌‌చార్జిలు, డీసీసీ అధ్యక్షులతో వివేక్ వెంకటస్వామి, అనిల్ యాదవ్ సమావేశమయ్యారు. గ్రామ, మండల, జిల్లా కమిటీలకు వెంటనే అర్హులైన కార్యకర్తల పేర్లను సిఫారసు చేయాలని సూచించారు. 

ఇందులో సామాజిక సమీకరణలకు పెద్దపీట వేయాలని, ప్రతి కమిటీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలు ఉండేలా చూసుకోవాలన్నారు. పాత, కొత్త నేతలను కూడా కమిటీలో పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఈ కమిటీల నియామకం పూర్తయ్యాక 
జిల్లా డీసీసీ అధ్యక్షుల నియామకం ఉంటుందని వారు వెల్లడించారు.

ఉమ్మడి మెదక్‌ జిల్లా నేతలతో పొన్నం, వివేక్‌ భేటీ

ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీ అధ్యక్షులు, కాంగ్రెస్ ముఖ్య నేతలు, పార్లమెంట్ ఇన్‌చార్జులు, జనరల్ సెక్రటరీలు, అబ్జర్వర్లతో పీసీసీ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశమయ్యారు. బేగంపేట టూరిజం ప్లాజాలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా పాల్గొన్నారు. 

ఈ నెల 14న గాంధీ భవన్‌లో ఉదయం సిద్దిపేట జిల్లాకు, మధ్యాహ్నం సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన మండల అధ్యక్షులు, జిల్లా కార్యవర్గానికి సంబంధించిన ఆశావహుల ఎంపిక పూర్తి చేస్తామని తెలిపారు. పార్టీకి నిజాయితీగా కష్టపడే వారికే అవకాశం ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. మండల, జిల్లా కార్యవర్గంలో యువతకు పెద్దపీట వేయాలని, మహిళలకు అవకాశం కల్పించాలని మంత్రి పొన్నం సూచించారు.