దిశా పటాని ఇంటిపై కాల్పులు.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు గ్యాంగ్‌స్టర్లు హతం!

 దిశా పటాని ఇంటిపై కాల్పులు.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు గ్యాంగ్‌స్టర్లు హతం!

బాలీవుడ్ నటి దిశా పటాని కుటుంబం నివసించే బరేరిలోని వారి ఇంటిపై సెప్టెంబర్ 12న జరిగిన కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు బయటకు రావడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈ కాల్పులకు పాల్పడిన గ్యాంగ్‌స్టర్లు కొద్ది రోజులకే పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్, హర్యానా ఎస్‌టిఎఫ్, ఉత్తరప్రదేశ్ ఎస్‌టిఎఫ్ సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. 

 దిశా పటాని నివాసం వద్ద ఏం జరిగిందంటే?

సెప్టెంబర్ 12న తెల్లవారుజామున బరేలీలోని దిశా పటాని నివాసానికి ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చారు. సీసీటీవీ ఫుటేజీలో రికార్డైన దృశ్యాల ప్రకారం, వారిలో ఒకడు బైక్ దిగి, పిస్టల్ తీసి ఇంటి గేటుపై పలు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఆ తర్వాత గాల్లో రెండు రౌండ్లు కాల్చి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ కాల్పుల సమయంలో ఇంటిలో దిశా పటాని తండ్రి, తల్లి, సోదరి ఖుష్బూ పటాని, సోదరుడు సూర్యాన్ష్ ఉన్నారు. అదృష్టవశాత్తూ, కుటుంబ సభ్యులకు ఎలాంటి గాయాలు కాలేదు. కానీ ఈ సంఘటన బరేలీలో తీవ్ర భయాందోళనలు సృష్టించింది. ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు, ఇది గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్,  రోహిత్ గోదారా గ్యాంగ్ పనే అని నిర్ధారించారు.

 

ఎన్‌కౌంటర్ లో నిందితులు మృతి.. 

 కాల్పులకు పాల్పడిన నిందితులు రవీంద్ర (రోహ్తక్ నివాసి), అరుణ్ (సోనిపట్ నివాసి) ఘజియాబాద్‌లోని ట్రోనికా సిటీలో ఉన్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్, హర్యానా ఎస్‌టిఎఫ్, ఉత్తరప్రదేశ్ ఎస్‌టిఎఫ్ బృందాలు బుధవారం ( సెప్టెంబర్ 17, 2025 న ) వారిని చుట్టుముట్టాయి. లొంగిపోవాల్సిందిగా పోలీసులు ఆదేశించగా, నిందితులు తప్పించుకునే ప్రయత్నంలో పోలీసులపై కాల్పులు జరిపారు.   నిందుతులు జరిపిన కాల్పుల్లో  పోలీసు వాహనానికి బుల్లెట్ తగలగా, మరొకటి పోలీసు అధికారికి తగిలి గాయాలయ్యాయి. దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో గాయాలపాలైన నిందితులను సమీప ఆసుపత్రికి పోలీసులు తరలించారు. చికిత్స పొందుతూ నింధితులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి గ్లాక్ పిస్టల్, ఒక జిగానా పిస్టల్ తో పాటు లైవల్ కర్ట్రిడ్జ్ లను స్వాధీనం చేసుకున్నారు.

 కారణం ఏమిటి?

ఈ కాల్పులకు గల కారణాన్ని గ్యాంగ్ సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా వెల్లడించింది. దిశా సోదరి, ఖుష్బూ పటాని ఇటీవల ఆధ్యాత్మిక ప్రవచనకర్త అనిరుద్ధాచార్య గురించి చేసిన వ్యాఖ్యలే ఈ దాడికి కారణమని పేర్కొన్నారు. అనిరుద్ధాచార్య లైవ్-ఇన్ సంబంధాలపై చేసిన వ్యాఖ్యలను ఖుష్బూ పటాని విమర్శించగా, ఇది గ్యాంగ్‌స్టర్ల ఆగ్రహానికి కారణమైంది. అయితే, ఖుష్బూ పటాని వ్యాఖ్యలు ప్రేమానంద్ జీ మహరాజ్‌ను ఉద్దేశించి చేసినవిగా కూడా తప్పుగా అర్థం చేసుకున్నారని పోలీసులు విచారణలో వెల్లడైంది. ఈ దాడి ద్వారా పటాని కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేయాలని గ్యాంగ్ లక్ష్యంగా పెట్టుకుంది. దీని వెనుక ప్రధానంగా దిశా తండ్రి జగదీష్ పటాని రిటైర్డ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కావడం కూడా ఒక కారణమని పోలీసులు తెలిపారు.

ఈ ఎన్ కౌంటర్ తో ఈ కేసు కీలకమైన మలుపు తిరిగింది . నిందితులు మరణించడంతో పోలీసులు ప్రస్తుతం ఈ గ్యాంగ్ లోని ఇతర సభ్యుల కోసం గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో, వారి కుటుంబానికి పోలీసులు మరింత భద్రతను పెంచారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో గ్యాంగ్‌ల కార్యకలాపాల తీవ్రతను మరోసారి చాటి చెప్పింది.