ఉత్తరాఖండ్ ను ముంచెత్తిన భారీవర్షాలు.. బిల్డింగులు కొట్టుకుపోయాయ్.. వరదల్లో చిక్కుకున్న 2500మంది టూరిస్టులు

ఉత్తరాఖండ్ ను ముంచెత్తిన భారీవర్షాలు.. బిల్డింగులు కొట్టుకుపోయాయ్.. వరదల్లో చిక్కుకున్న 2500మంది టూరిస్టులు

క్లౌడ్​ బరస్ట్​, భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడి మరోసారి ఉత్తరాఖండ్ అతలాకుతలం అయింది. గురువారం(సెప్టెంబర్​18) ఉదయం  క్లౌడ్​ బరస్ట్​ కారణంగా చమోలీ జిల్లాలో భారీ వరదలు సంభవించాయి. కొండచరియలు విరిగిపడి నందనగర్​లో బిల్డింగులు కొట్టుకుపోయాయి. బురద, మట్టి, బండరాళ్ల శిథిలాల కింద ఇళ్లు కూరుకుపోయి ఆనవాళ్లు లేకుండా పోయాయి. 12మంది గల్లంతయినట్లు అధికారులు చెప్పారు. గల్లంతయిన వారికోసం సహాయక చర్యలు చేపట్టారు.  

డెహ్రాడూన్‌లో క్లౌడ్​ బరస్ట్​కారణంగా డెహ్రాడూన్ నుండి ముస్సోరీకి వెళ్లే 35 కిలోమీటర్ల రహదారి అనేక చోట్ల దెబ్బతింది. ఫలితంగా వరుసగా మూడవ రోజు కూడా 2500 మంది పర్యాటకులు ముస్సోరీలో చిక్కుకుపోయారు.

రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) బృందం నందప్రయాగ్‌లో సహాయక చర్యలు ముమ్మరం చేసింది. రోడ్లపై పేరుకుపోయి శిథిలాలను తొలగిస్తున్నారు.  జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) బృందాకు కూడా నందప్రయాగ్‌కు చేరుకున్నాయి. 

శిథిలాల కింద చిక్కుకున్న ఇద్దరు మహిళలు,ఒక చిన్నారిన- స్థానిక పోలీసులు, జిల్లా విపత్తు ప్రతిస్పందన దళం (DDRF) ,రెవెన్యూ బృందాలు సురక్షితంగా రక్షించారు. సుమారు 200 మంది గ్రామస్తులను సురక్షిత ప్రదేశాలకు తరలించారు. గాయపడిన వారిని నందనగర్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో చేర్చారు. కనీసం-12 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని చమోలి జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు.

►ALSO READ | అక్రమంగా ఓట్లు తొలగించారు.. 100శాతం పక్కా ఆధారాలున్నాయ్:రాహుల్ గాంధీ

రెండు రోజుల క్రితం డెహ్రడూన్​, పితోరాగఢ్, నైనిటాల్​లో క్లౌడ్ బరస్ట్​ కారణంగా 23మంది ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ వారి మృతదేహాలను వెలికితీసినట్లు డిజాస్టర్​ మేనేజ్​ మెంట్ అథారిటీ తెలిపింది. 

ఈ సీజన్‌లో కురిసిన వర్షాలు, వరదలు, కొండచరియలు పడటం, ఆకస్మిక వరదల కారణంగా హిమాచల్ ప్రదేశ్‌లో ఇప్పటివరకు 419 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరాఖండ్ ,హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో  రాబోయే 48 గంటలు హై అలర్ట్‌ ప్రకటించింది వాతావరణ శాఖ.