
భారతదేశం అనగానే సర్వీస్ సెక్టార్ గుర్తుకొచ్చేది ప్రపంచం మెుత్తానికి. భారతదేశంలోని ఐటీ సేవల రంగం, బ్యాంకింగ్ రంగం వృద్ధి గడచిన కొన్ని దశాబ్ధాలుగా దేశానికి ఆర్థిక బాటలు వేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం వేగంగా ముందుకెళుతున్న ఇండియన్ ఎకానమీలో ఇకపై కేవలం ఐటీ, బ్యాంకింగ్ వంటి మూల స్థంబాలపైనే పెట్టుబడిదారులు నమ్మకాలు పెట్టుకోవటం వేస్ట్ అంటున్నారు జెఫరీస్ ఈక్విటీస్ గ్లోబల్ హెచ్ క్రిస్టోఫర్ వుడ్.
ఇకపై ఐటీ సేవలు, బ్యాంకింగ్ రంగాలు పాత చింతకాయ పచ్చడేనని.. ఇండియా ఎకానమీ వీటిని మించి డైవర్సిఫై అయ్యి ముందుకు సాగుతోందని వుడ్ అన్నారు. ఇప్పటికీ భారత ఐటీ రంగం దీర్ఘకాలంలో పెట్టుబడిదారులకు మంచి ఎంపికగా ఉన్నప్పటికీ దానికి ఏఐ, టారిఫ్స్ వంటి ప్రమాదాలు ఈ రంగాన్ని వెంటాడతాయని వుడ్ చెప్పారు. ట్రంప్ ఆసియా దేశాలపై 50 శాతం వరకు పన్నులు విధించటం పెద్ద ఇబ్బందులను తెచ్చిపెడుతోందని అన్నారు. గడచిన ఏడాది కాలంలో నిఫ్టీ ఐటీ సూచీ 15 శాతం వరకు నష్టపోవటం యూఎస్ నుంచి తగ్గిన డీల్స్, కొత్త ప్రాజెక్టుల లేమికి అద్దం పడుతోంది.
ప్రస్తుతం భారతదేశంలో ఇన్ ఫ్రా రంగంలో కొనసాగుతున్న వృద్ధితో ఎయిర్ పోర్ట్స్, సిమెంట్ వంటి రంగాలపై దృష్టి పెట్టాలని క్రిస్టోఫర్ వుడ్ అన్నారు. దీనికి తోడు ట్రావెల్ అండ్ టూరిజం, హెల్త్ కేర్, హాస్పిటల్స్, డిఫెన్స్ రంగాల్లోని కంపెనీలకు భవిష్యత్తు ఉంటుందని.. ఈ రంగాల్లో డిమాండ్, వినియోగం పెరగటమే అందుకు కారణంగా వుడ్ చెబుతున్నారు. పైగా ఆపరేషన్ సిందూర్ తర్వాతి నుంచి భారత డిఫెన్స్ రంగంలో కొత్త ఉత్తేజం, భారీగా ఆర్డర్లు, దేశీయంగా డిఫెన్స్ ఉత్పత్తుల అభివృద్ధి ఈ రంగానికి మంచి భవిష్యత్తును సూచిస్తోందని వుడ్ చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు కేవలం ఐటీ, బ్యాంకింగ్ రంగాలపైనే ఆధారపడటం మానేసి తమ పోర్ట్ ఫోలియోను డైవర్సిఫై చేయాల్సిన సమయం వచ్చిందని చెప్పారు.