చండ్రుగొండ, వెలుగు : గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కష్టపడి పనిచేసే కార్యకర్తలకు సముచితస్థానంతో పాటు పదవులు వరిస్తాయని భద్రాద్రికొత్తగూడెం జిల్లా డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న అన్నారు. శుక్రవారం దామరచర్ల గ్రామంలోని ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ లో జరిగిన జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. 2026లో ప్రతి ఆదివారం రోజున జిల్లా లోని ప్రతి పంచాయితీ ఆఫీసు ఆవరణ లో సాయంత్రం పార్టీ జెండా ఆవిష్కరించాలని సేవాదళ్ కార్యకర్తలకు సూచించారు.
జిల్లా లోని ప్రతి మండలంలో నెలకోసారి పార్టీ అనుబంధ సంఘాలతో సమావేశాలు నిర్వహించాలన్నారు. జిల్లాలో పార్టీ మండల అధ్యక్షుల పనితీరు మెరుగుపర్చుకోవాలని సూచించారు. రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు కష్టపడి పనిచేయాలన్నారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలో కొత్తగా గెలిచిన సర్పంచ్ లకు గ్రామాల అభివృద్ధి, పాలనా విధానంపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
నియోజకవర్గంలో నామినేటెడ్ పదవుల్లో సేవాదళ్ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారు. ప్రతి పంచాయితీలో నిర్వహించే జెండా పండుగ గ్రామాల్లో పార్టీ అభివృద్ధికి దోహద పడుతుందన్నారు. పార్టీ అభివృద్ధికి ఐక్యత తో పనిచేయాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సమావేశంలో సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి దయాకర్ రావు, జిల్లా అధ్యక్షుడు నర్సింహారావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వీరబాబు, దిశకమిటీ సభ్యులు సురేశ్, నాయకులు భోజ్యానాయక్, కృష్ణారెడ్డి, అంజి,తుమ్మలపల్లి సురేశ్, బడుగు కృష్ణవేణి, జిల్లా లోని పలు మండలాల సేవాదళ్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
