
లక్షల్లో శాలరీ ప్యాకేజీలు, లగ్జరీ లైఫ్.. ఇల్లు నుంచి కారు వరకు ఫారెన్ టూర్ నుంచి ఐఫోన్ల వరకు ఏది కావాలన్నా అలా అనుకోగానే ఇలా కొనేస్తారు ఐటీ ఉద్యోగులు. సహజంగా ఇతర రంగాల్లో కంటే ఎక్కువ వేతనాలు అందుకునే ఐటీ ప్రొఫెషనల్స్ లైఫ్ ఇలా సాఫీగా సాగిపోతుంటుంది. అన్నింటికీ ఈఎంఐలే. జాబ్ ఉన్నంత వరకు అంతా సేఫే.. గేమ్ లో ఏవైనా మార్పులు వస్తే అప్పటి వరకు జీవించిన లైఫ్ ఒక కలే అని అర్థమైపోతుంది. ఏఐ రాకతో ఇప్పటికే చాలా మంది దీనిని ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు కూడా.
ఈ క్రమంలోనే అసలు టెక్కీలకు ఐటీ కంపెనీలు ఇచ్చే శాలరీ హైక్స్ గురించి ఒక చార్టెడ్ అకౌంటెంట్ చెప్పిన మాటలు వింటే బుర్ర పోతోంది. చాలా కంపెనీల్లో 8 శాతం పే హైక్ అంటే మంచి పెంపని అర్థం. కానీ భారతదేశంలో ద్రవ్యోల్బణం కారణంగా ప్రజల ఖర్చులు దాదాపు 12 శాతం పెరిగిపోయిందనే విషయం టెక్కీలు గమనించనంత వరకు హైక్ హ్యాపీగానే కనిపిస్తుంది వారికి. అయితే మీనల్ గోయెల్ అనే సీఏ వేతనాల పెంపులు.. పెరుగుతున్న ఖర్చులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఎత్తి చూపుతున్నారు. గడచిన 10 ఏళ్ల కాలంలో ఐటీ రంగంలో ఎంట్రీ లెవెల్ శాలరీలు పెద్దగా పెరగలేదని ఆమె అన్నారు.
ఉదాహరణకు 2012లో ఫ్రెషర్లకు రూ.3లక్షల ప్యాకేజీ ఉండగా 2022 నాటికి దానిని రూ.3.6 లక్షలకు పెంచాయి కంపెనీలు. కానీ ప్రజల ఖర్చులు ఇంటి అద్దె, సరుకులు, మెడికల్ ఖర్చుల నుంచి లైఫ్ స్టైల్ వరకు రెండంకెల గ్రోత్ చూస్తుంటే.. శాలరీలు మాత్రం సింగిల్ డిజిట్లలో పెంచుతున్నాయి ఐటీ కంపెనీలు. ఆదాయం కంటే ఖర్చులు పెరగటంతో చాలా మంది బంగారం వంటి పెట్టుబడుల్లోకి డబ్బులు తరలిస్తున్నట్లు ఆమె చెప్పారు. చారిత్రాత్మకంగా బంగారం నుంచి రాబడి దేశంలో ద్రవ్యోల్బణాన్ని అధిగమించిందని.. ప్రస్తుతం దేశంలో గోల్డ్ రేట్లు డబుల్ అయ్యాయని చెప్పారు సదరు సీఏ. దీంతో టెక్కీల వేతనాల కంటే గోల్డ్ ఎక్కువ పెరిగి రాబడిని అందించిందని గోయెల్ చెబుతున్నారు.
ప్రజలు నేటి కాలంలో ద్రవ్యోల్బణాన్ని బీట్ చేసే రాబడులిచ్చే పెట్టుబడుల్లో తమ డబ్బు పెట్టాల్సిందేనని ఆమె సూచిస్తున్నారు. పెరుగుతున్న ఖర్చులను అధిగమించటానికి శాలరీ హైక్స్ సరిపోవని ఆ గ్యాప్ ఫిల్ చేయటానికి ఇన్వెస్ట్మెంట్స్ మంచి మార్గంగా సీఏ చెప్పారు. ఉదాహరణకు టీసీఎస్ ఉద్యోగులకు 4.5 శాతం నుంచి 7 శాతం మధ్య వేతనం పెంచగా.. దేశంలో 4.6 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణంతో వారికి అందుతున్న బెనిఫిట్ దాదాపు సూన్యమేనని చెప్పారు. మధ్యస్థాయి ఐటీ ఉద్యోగి జీవితంలో పెరిగిన శాలరీ హైక్ బెనిఫిట్స్ అస్సలు కనిపించటం లేదని అందుకే ప్రజలు ద్రవ్యోల్బణాన్ని అర్థం చేసుకుని.. దానిని అధిగమించటానికి సరైన పెట్టుబడి ప్లానింగ్ అవసరమని సీఏ హెచ్చరిస్తున్నారు. ఇలా అయితే భవిష్యత్తులో జీవించటం కష్టతరంగా మారుతుందని అన్నారు.